IAF chief: వైమానిక దళంలో ఏఐ కీలకం.. ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాకు ఐదో తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం సుఖోయ్ ఎస్‌యూ-57 (Sukhoi Su-57)ను అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని భారత వైమానిక దళం (IAF) చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) తెలిపారు. ఈ యుద్ధ విమానాలను భారత్‌లోనే ఇరు దేశాలు సంయుక్తంగా ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ వద్ద ఉన్న మొత్తం సైనిక బలంలో వైమానిక శక్తి అత్యంత కీలకమైనదని అమర్ ప్రీత్ సింగ్ అన్నారు. కృత్రిమ మేధ (AI) సాంకేతికత సాయంతో వైమానిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
వివరాలు
భవిష్యత్ యుద్ధాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
ఐఏఎఫ్ ఆధునీకరణ గురించి ప్రస్తావిస్తూ.. భవిష్యత్ యుద్ధాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏఐ ఆధారిత దళం (AI-Augmented Force)గా వైమానిక దళాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మరోవైపు.. అన్నీ అనుకున్న విధంగా జరిగితే త్వరలో ఫ్రాన్స్‌తో మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఐఏఎఫ్ చీఫ్ వెల్లడించారు.
114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనకు భారత్ ఫిబ్రవరిలో ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు.
వివరాలు
ప్రతేడాది 36 నుంచ 40 యుద్ధ విమానాలు అవసరం
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ధరలు, ఇతర కీలక అంశాలపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని అమర్ ప్రీత్ సింగ్ చెప్పారు.
ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే భారత వైమానిక దళానికి ఏటా కనీసం 36 నుంచి 40 యుద్ధ విమానాలు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ అవసరాలను తీర్చుకోవడంతో పాటు భవిష్యత్‌లో వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే భారత్ సొంతంగా యుద్ధ విమాన ఇంజిన్‌లను ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఐఏఎఫ్ చీఫ్ స్పష్టం చేశారు.