Loading...
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు!
ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు!

DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే ముందస్తు భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోర్టు ద్వారా పిటిషన్లు వేయించారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె మండిపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీకే అరుణ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించిందని డీకే అరుణ విమర్శించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా అదే అప్రజాస్వామిక విధానాలను కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఖైరతాబాద్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని స్పష్టమవుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్‌ నాయకత్వంలో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు.

వివరాలు

దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిజంగా తమ పాలనపై, పది నెలల్లో సాధించిన అభివృద్ధిపై విశ్వాసం ఉంటే.. బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డీకే అరుణ సవాల్‌ విసిరారు.

బీఆర్ఎస్‌ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు కనీస నైతికత ఉంటే తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా కేంద్ర నిధులను కేటాయిస్తున్నారని డీకే అరుణ పేర్కొన్నారు.

అయితే రాష్ట్రంలోని బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తెలంగాణను దారుణంగా అప్పుల పాలు చేశాయని ఆమె ఆరోపించారు.

వివరాాలు

అభివృద్ధి శూన్యం.. ప్రజలు గుణపాఠం చెప్పాలి

కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని డీకే అరుణ విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనలోనూ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు నిధులు లేవంటూ చేతులు దులుపుకోవడం తప్ప.. ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆరోపించారు.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల వైఫల్యాలను, వాటి మోసపూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని డీకే అరుణ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఖైరతాబాద్‌లో భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ఆమె ప్రజలను కోరారు.

ADVERTISEMENT