Appliance makers: ధరలు పెరిగినా తగ్గని జోష్.. పండగ సీజన్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులకు భారీ డిమాండ్!
ఈ వార్తాకథనం ఏంటి
పండగ సీజన్‌కు ముందు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర గృహోపకరణాల ధరలను ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు 5 నుంచి 7 శాతం వరకు పెంచాయి. పెరిగిన ధరలు అక్టోబర్ 1నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ధరలు పెరిగినప్పటికీ.. దసరా, దీపావళి పండగ సీజన్‌లో గృహోపకరణాల విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని ఆయా కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విలువ పరంగా 15నుంచి 35శాతం వరకు వృద్ధి సాధిస్తామని ప్రముఖ సంస్థల అధిపతులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ప్రీమియం మోడళ్ల కొనుగోలుకు వినియోగదారులు ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవడం, పాత ఉత్పత్తుల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే రీప్లేస్‌మెంట్ డిమాండ్ పెరగడం వంటి అంశాలు పండగ సీజన్‌లో విక్రయాలను పెంచుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
వివరాలు
హైమర్.. 30-35 శాతం వృద్ధి
ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర గృహోపకరణాల ధరలు పెరిగినప్పటికీ.. పండగ సీజన్‌లో తమ సంస్థ రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని హైమర్ సంస్థ అధ్యక్షుడు ఎన్‌ఎస్ సతీష్ తెలిపారు.
విలువ పరంగా 30-35 శాతం వృద్ధి సాధిస్తామని చెప్పారు. యూనిట్ల విక్రయాల్లో దాదాపు 20 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు.
ఎల్‌జీకి పెరగనున్న డిమాండ్
పండగ సీజన్‌లో తమ ఉత్పత్తులకు డిమాండ్ అధికంగానే ఉంటుందని ఎల్‌జీ ప్రతినిధి తెలిపారు. కొత్త గృహోపకరణాల కొనుగోలుకు దసరా మంచి వేదికగా మారుతుందని పేర్కొన్నారు.
సాధారణంగా రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లతో పాటు డిష్‌వాషర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు తదితర ఉత్పత్తుల కొనుగోలుకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
వివరాలు
సోనీ.. ప్రీమియం టీవీలపై ఫోకస్
ఉత్పత్తుల విలువ పరంగా దాదాపు 15-20 శాతం డిమాండ్ వృద్ధి ఉంటుందని సోనీ ఇండియా డైరెక్టర్ సునీల్ నయ్యర్ తెలిపారు.
ముఖ్యంగా ప్రీమియం టీవీ మోడళ్ల కొనుగోలుకు వినియోగదారులు మొగ్గుచూపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గోద్రెజ్ అప్లయన్సెస్‌కు ఏసీ, ఫ్రిజ్‌లపై ఆశలు
పండగ సీజన్‌లో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల విక్రయాలకు అధిక డిమాండ్ ఉంటుందని గోద్రెజ్ అప్లయన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు.
ఓనం పండగ సందర్భంగా తమ ఉత్పత్తులకు మంచి స్పందన లభించిందని చెప్పారు. అదే తరహా డిమాండ్ దసరా, దీపావళి సమయంలోనూ కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు.