Tamil Nadu: రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోకపోతే రాజీనామా.. టీవీకేకు కాంగ్రెస్ మంత్రుల అల్టిమేటం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు అధికార కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వం చిచ్చు రేపుతోంది. 2029 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే.. ప్రభుత్వంలో కొనసాగలేమని కాంగ్రెస్ మంత్రులు స్పష్టం చేశారు. కేబినెట్‌లోని తమ ఇద్దరు మంత్రులు పదవులకు రాజీనామా చేసి బయటకు వస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.
వివరాలు
కన్యాకుమారి సభలో కాంగ్రెస్ మంత్రి కీలక వ్యాఖ్యలు
కన్యాకుమారిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ఎస్. రాజేశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
2029 ఎన్నికలకు రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి అని ఆయన తేల్చిచెప్పారు.
రాహుల్ గాంధీ తదుపరి ప్రధానమంత్రి అవుతారని పేర్కొన్నారు.
టీవీకే ఈ ప్రతిపాదనను అంగీకరించకపోతే.. కేబినెట్‌లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని వీడతారని రాజేశ్ కుమార్ ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ఇదేనని, పార్టీ కార్యకర్తలు కూడా దీనికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడమే కారణం
టీవీకే నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలే కాంగ్రెస్ ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
పార్టీఅధినేత,ముఖ్యమంత్రి విజయ్‌ను జాతీయ స్థాయి నాయకుడిగా పేర్కొంటూ.. భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు టీవీకే నాయకులు ప్రచారం చేస్తున్నారు.
మానవవనరుల శాఖ మంత్రి డి.శరత్‌కుమార్ అసెంబ్లీలోనే విజయ్ తదుపరి భారత ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు.
మరో మంత్రి ఆధవ్ అర్జున కూడా దేశానికి దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం సాధించిన నేపథ్యంలో విజయ్ నాయకత్వంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగిందని ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు చెబుతున్నారు.
విజయ్‌ను జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా చూపించే ఈ ప్రచారమే కాంగ్రెస్ అసంతృప్తికి కారణమైంది.
వివరాలు
కూటమిలో తన బలాన్ని గుర్తు చేస్తున్న కాంగ్రెస్
టీవీకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది.
2029 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీయే తమ ఏకైక జాతీయ ప్రధాని అభ్యర్థి అని ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన సమయంలో.. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ మద్దతుతోనే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.
ఈ మద్దతు ఫలితంగానే దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు కేబినెట్‌లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లభించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం టీవీకేపై ఒత్తిడి పెంచేందుకు తమ రాజకీయ బలాన్ని కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది.
వివరాలు
తొలి ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చిన టీవీకే
నటుడు విజయ్ 2024లో తమిళగ వెట్రి కళగం(టీవీకే)పార్టీని ప్రారంభించారు.ఆ పార్టీ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే అనూహ్య విజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టింది.
అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉండగానే ప్రధాని అభ్యర్థి విషయంలో కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రతిపాదించడం,మరోవైపు విజయ్‌ను భవిష్యత్ ప్రధానిగా టీవీకే నేతలు ప్రచారం చేయడం.. అధికార కూటమిలో విభేదాలను మరింత బహిర్గతం చేస్తున్నాయి.
ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
కూటమి భవిష్యత్తు, విజయ్ నాయకత్వంపై జరుగుతున్న జాతీయ స్థాయి ప్రచారం తదుపరి రాజకీయ పరిణామాలకు కీలకంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.