LOADING...
Indore : మరుగుదొడ్డి వద్ద మంచినీటి పైపులైన్‌ లీకేజీనే కారణం: వారం రోజుల్లో 10 మంది మృతి
వారం రోజుల్లో 10 మంది మృతి

Indore : మరుగుదొడ్డి వద్ద మంచినీటి పైపులైన్‌ లీకేజీనే కారణం: వారం రోజుల్లో 10 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో కలుషిత నీటిని వినియోగించడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మంచినీటి సరఫరాలో ఏర్పడిన లోపమే ఈ విషాదానికి కారణమని తాజాగా అధికారులు గుర్తించారు. మరుగుదొడ్డి ప్రాంతం సమీపంలో ఉన్న తాగునీటి పైపులైన్‌లో లీకేజీ ఏర్పడటం వల్ల మురుగునీరు కలిసినట్టు తేలింది. వరుసగా కొన్నేళ్లుగా దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందుతున్న ఇందౌర్‌లో ఇలాంటి ఘటన జరగడం పలు సందేహాలకు తావిస్తోంది. ఇందౌర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, భగీరథ్‌పుర్‌ ప్రాంతంలోని తాగునీటి పైపులైన్‌లో లీకేజీ ఉన్నట్టు గుర్తించారు. ఆ పైపు మరుగుదొడ్డి మార్గం గుండా వెళ్లడంతో మురుగు నీరు కలిసే అవకాశం ఉందని తెలిపారు.

వివరాలు 

 వారం రోజుల వ్యవధిలోనే 10 మంది మృతి 

ఇదే కారణంగా నీరు కలుషితమై, డయేరియా సహా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ల్యాబ్‌ పరీక్షల నివేదికలు కూడా కలుషిత నీటే ప్రధాన కారణమని నిర్ధారించినట్టు పేర్కొన్నారు. ఈ కలుషిత నీటిని తాగిన కారణంగా కేవలం వారం రోజుల వ్యవధిలోనే 10 మంది మృతి చెందినట్టు ఇందౌర్‌ మేయర్‌ పుష్యమిత్ర భార్గవ వెల్లడించారు. అంతేకాకుండా 1100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని, వారిలో చాలామంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్‌ మంత్రి కైలాశ్‌ విజయ్‌వర్గీయ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, కలుషిత నీటితో కలిపిన పాలు తాగి ఓ చిన్నారి మృతి చెందడం హృదయ విదారకంగా మారింది.

వివరాలు 

బిడ్డకు పట్టించే పాలలో కుళాయి నీరు

''పదేళ్ల తర్వాత దేవుడు మాకు ఆనందాన్ని ఇచ్చాడు.ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని తీసుకెళ్లిపోయాడు'' అంటూ ఓ బాధిత కుటుంబం కన్నీటి పర్యంతమైంది. ఐదు నెలల చిన్నారి అవ్యాన్‌ను వారు కోల్పోయారు.డాక్టర్‌ సూచన మేరకు బిడ్డకు పట్టించే పాలలో కుళాయి నీరు కలిపామని,అదే నీరు విషంగా మారిందని వారు వాపోయారు. అవ్యాన్‌ తండ్రి సునీల్‌ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు.ఎన్నో ఏళ్ళ ప్రార్థనల తర్వాత ఈ ఏడాది జులై 8న తమకు మగబిడ్డ జన్మించాడని తెలిపారు. వారికి ఇప్పటికే పదేళ్ల క్రితం పుట్టిన ఓ కుమార్తె ఉంది.''ఇంతకాలం బిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా జ్వరం వచ్చింది.వెంటనే విరేచనాలు మొదలయ్యాయి. వైద్యులను సంప్రదించినా పరిస్థితి మెరుగుపడలేదు''అని సునీల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement