COVID 19 JN.1 Sub Variant: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్టాలకు కేంద్రం కీలక సలహాలు
COVID 19 JN.1 Sub Variant: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 వెలుగు చూడడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సలహాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ పంపారు. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ఈ వైరస్ వ్యాప్తిని వీలైనంత వరకు తగ్గించవచ్చని కేంద్రం పేర్కొంది. ఇన్‌ఫ్లుఎంజా వంటి శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి జిల్లాల వారీగా డేటాపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని చెప్పింది.
RT-PCR పరీక్షల సంఖ్యను పెంచాలి: కేంద్రం
అన్ని జిల్లాల్లో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం తగిన పరీక్షలు నిర్వహించాలని, RT-PCR, యాంటిజెన్ పరీక్షలను కొనసాగించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. RT-PCR పరీక్షల సంఖ్యను పెంచాలని, భారతీయ SARS CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) ప్రయోగశాలలకు నమూనాలను పంపాలని మంత్రిత్వ శాఖ కోరింది. తద్వారా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించవచ్చని వివరించింది. దేశంలో కోవిడ్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిరంతర సహకార అవసరమని, అలా అయితేనే కరోనా వ్యాప్తిని నియంత్రించొచ్చని చెప్పారు. దేశంలో JN.1 సబ్ వేరియంట్ మొదటి కేసు 8 డిసెంబర్ 2023న కేరళలోని తిరువనంతపురంలో వెలుగుచూసింది. 79 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్ బయటపడింది.