Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో.. అధికారంలోకి రాగానే కుల గణన, 4లక్షల ఉద్యోగాల భర్తీ
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. జైపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మేనిఫెస్టో ఆవిష్కరించారు. మేనిఫెస్టోలో కీలక హామీలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. స్వామినాథన్ కమిటీ సూచనల మేరకు రైతుల కోసం ఎంఎస్‌పీ చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే ఆరోగ్య బీమా మొత్తాన్ని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచనున్నట్లు చెప్పింది. 4 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని వివరించింది. పంచాయతీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త క్యాడర్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం రూ.500కు లభిస్తున్న గ్యాస్ సిలిండర్ రూ.400కి తగ్గించనున్నట్లు వెల్లడించింది.
మర్చంట్ క్రెడిట్ కార్డ్ పథకం, ఉచిత విద్య
రాష్ట్రంలో ఆర్టీఈ చట్టం తీసుకురావడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ 12వ తరగతి వరకు ఉచితంగా విద్యనందిస్తామని హామీల్లో పేర్కొంది. MNREGA పని రోజుల సంఖ్యను 125 నుంచి 150 రోజులకు పెంచుతామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. చిరు వ్యాపారులు, దుకాణదారులకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం అందించేందుకు మర్చంట్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని తీసుకొస్తామని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 9,18,27తో నాలుగో వేతన శ్రేణి, అధికారులకు అపెక్స్ స్కేల్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 100 వరకు జనాభా ఉన్న గ్రామాలు, కుగ్రామాలను రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించనున్నట్లు, ప్రతి గ్రామం, పట్టణ వార్డులో సెక్యూరిటీ గార్డులను నియమిస్తామని హామీ ఇచ్చింది.