Telangana: తెలంగాణలో 11మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వారికి కొత్త పోస్టింగ్‌లను కేటాయించింది. కొత్త పోస్టింగులు ఇచ్చిన వారిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీలు బి.వెంకటేశం, ఎ.వాణీ ప్రసాద్ ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రస్తుతం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండగా.. కొత్తగా విపత్తు నిర్వహణశాఖకు బదిలీ అయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ (బీసీ వెల్ఫేర్)గా ఉన్న బుర్రా వెంకటేశంను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అలాగే కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
జీఏడీ కార్యదర్శి రాహుల్ బొజ్జా
రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ వాణీ ప్రసాద్‌ను పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఈపీఆర్టీఐ డైరెక్టర్ జనరల్‌గా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. రోడ్లు, భవనాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి కెఎస్ శ్రీనివాసరాజును రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా నియమించారు. ముఖ్యమంత్రి కార్యదర్శి రాహుల్ బొజ్జాను జీఏడీ కార్యదర్శిగా నియమించారు. ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి
కమర్షియల్ టాక్సెస్ కమిషనర్ డాక్టర్ క్రిస్టినాను ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ టికె శ్రీదేవిని వాణిజ్య పన్నుల కమిషనర్‌గా నియమితులయ్యారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను నియమించారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిశోర్, జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి, నల్గొండ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.