10th class: పదో తరగతి వార్షిక పరీక్షలలో కీలక మార్పులు.. ఈ ఏడాది నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రేడింగ్ విధానానికి వీడ్కోలు పలుకుతూ, విద్యార్థులకు మార్కులను ఆధారంగా మార్చే విధానం అమలు చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అంతర్గత పరీక్షలకు కేటాయించే మార్కుల విధానాన్ని ఎత్తివేసి, మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసి, మార్చి 2024 నుంచి ఈ మార్పులను అమలు చేయనున్నారు.
మార్పుల వివరణ
ఇప్పటి వరకు అంతర్గత పరీక్షలకు 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు కేటాయించబడేవి. కానీ ఇప్పుడు, ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు ఉండే విధంగా పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్‌లో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం విభాగాలకీ 50 మార్కుల చొప్పున కేటాయిస్తారు. తీవ్ర అసంతృప్తి విద్యా సంవత్సరం ప్రారంభమైన ఆరునెలల తర్వాత ఈ మార్పులను ప్రకటించడం విద్యారంగ నిపుణుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కొత్త విధానానికి సిద్ధం కావడానికి సరిపడ సమయం లేకుండా నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఎస్‌ఏ-1 పరీక్షలు పూర్తయిన దశలో ఈ మార్పులు చేయడం పట్ల ప్రభుత్వం తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి.
గ్రేడింగ్ విధానానికి గుడ్‌బై
ఇప్పటివరకు విద్యార్థులకు గ్రేడింగ్ ప్రకారం ఫలితాలు ప్రకటించబడేవి. మార్కుల ఆధారంగా గ్రేడ్ మారేందుకు కనీసం 9 మార్కుల తేడా అవసరమవుతుందని, తద్వారా పునర్‌మూల్యాంకనం దరఖాస్తులు తక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు గ్రేడింగ్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేయడంతో విద్యార్థుల ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ప్రభావం ఇంతకు ముందు బాసర ఆర్‌జీయూకేటీలో గ్రేడ్ల ఆధారంగా ఇంటిగ్రేటెడ్ బీటెక్ సీట్లు కేటాయించబడేవి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 0.4 శాతం అదనపు ప్రోత్సాహం అందించబడేది. ఇప్పుడు గ్రేడింగ్ విధానం లేకుండా ఈ అదనపు ప్రయోజనాన్ని ఎలా అమలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
మరోవైపు 6-9 తరగతులకూ 1-5 తరగతులకూ మార్పులపై స్పష్టత లేదు
6-9 తరగతుల్లో 20 మార్కుల అంతర్గత మూల్యాంకన విధానం కొనసాగుతుండగా, 1-5 తరగతుల పరీక్షల విధానం పై ఇంకా ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. మార్పులు సకాలంలో ఉంటే మంచిది విద్యా నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్యార్థులు ఈ మార్పులకు మానసికంగా సిద్ధమవ్వడానికి మార్పులను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే మంచిదని సూచించారు. పరీక్షల విధానంలో కీలకమైన మార్పులను ప్రవేశపెట్టే ముందు సమగ్రమైన ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. మార్కుల ఆధారిత వ్యవస్థ విద్యార్థుల్లో ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసే ముందు విద్యార్థుల శ్రేయస్సును ప్రాధాన్యంగా తీసుకోవడం అవసరం.