గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో జైశంకర్ భేటీ
టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సమావేశమయ్యారు. ఈ భేటీ వివరాలను జైశంకర్ ట్విటర్ వేదికగా తెలిపారు. పిచాయ్‌తో అంతర్జాతీయ వ్యూహాత్మక పరిణామాలు, డిజిటలైజేషన్ గురించి చర్చించినట్లు మంత్రి వెల్లడించారు. భారతదేశ పర్యటనలో భాగంగా పిచాయ్... సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీతో పలు కీలక అంశాలపై చర్చించారు. జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారత దేశానికి వచ్చిన నేపథ్యంలో మోదీ- పిచాయ్ ఈ అంశంపై కూడా చర్చించారు.
పిచాయ్‌తో సమావేశంపై మోదీ హర్షం
మోదీతో సమావేశం అనంతరం పిచాయ్ ట్వీట్ చేశారు. మోదీ నాయకత్వంలో దేశంలో వేగంగా సాంకేతిక మార్పులు అమల్లోకి వస్తున్నట్లు చెప్పారు. అందరికోసం పని చేసే ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు భారత దేశ జీ20 ప్రెసిడెన్సీకి సహకరిస్తామన్నారు. భారత దేశంతోగల బలమైన భాగస్వామ్యం కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ కూడా పిచాయ్‌తో సమావేశం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్, టెక్నాలజీ తదితర అనేక అంశాల గురించి చర్చించినట్లు ట్విట్టర్ వేదికగా చెప్పారు. సుస్థిర అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.