బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోరం: సిలిండర్ పేలుడుతో భారీ ప్రమాదం
భారత రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఆందోళనకరంగా మారిపోయింది. అనుకోని ప్రమాదం జరగడంతో సమావేశానికి వచ్చిన వారికి గాయాలయ్యాయి. అసలేం జరిగిందంటే.. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడు లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే, ఎంపీలను సమ్మేళనానికి ఆహ్వానిస్తూ బాణసంచా పేల్చారు పార్టీ శ్రేణులు. ఆ బాణసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న గుడిసె పై పడటంతో ఒక్కసారిగా ఆ గుడిసె అంటుకుంది. దాంతో నిప్పులు ఎగజిమ్మాయి. ఆ నిప్పురవ్వలు గుడిసెలో ఉన్న సిలిండర్ ను తాకటంతో సిలిండర్ పేలిపోయింది.
ఒకరు మరణం.. 10మందికి గాయాలు
సిలిండర్ పేలుడు ధాటికి అక్కడే ఒకరు ప్రాణాలు కోల్పోగా చాలామంది గాయాల పాలయ్యారు. పేలుడు వల్ల కాళ్లు, చేతులు కాలిపోయి అవస్థలు పడ్డారు. సిలిండర్ పేలుడు వల్ల ఆత్మీయ సమ్మేళనం కాస్త అయోమయంగా మారిపోయింది. మంటల వల్ల గాయాలైన వారిని ఖమ్మంలోని ఆసుపత్రిలో చేర్చారు. దాదాపు 10మందికి గీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయాలైన వారికి సరైన వైద్యం అందజేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్, వైద్య సిబ్బందికి తెలియజేశారు. మరింత మెరుగైన వైద్యం కోసం అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. ప్రమాదం జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రజా ప్రతినిధులు, ఆత్మీయ సమ్మేళనంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, బాధితులు అందరికీ సాయం చేసేందుకు అండగ ఉంటామన్నారు.