తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్
అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన ఒడిశాలోని బైలాదిలా మైనింగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు భాజపా ప్రభుత్వానికి నిజంగా కట్టుబడి ఉంటే బైలదిల్లా మైనింగ్ కాంట్రాక్టును బయ్యారం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ (వీఎస్‌పీ)కి అప్పగించాలని ఆయన అన్నారు. అదానీ, ప్రధాని ఇద్దరూ తెలుగు రాష్ట్రాల సంపదను ధ్వంసం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాను చెప్పింది తప్పు అయితే పరువునష్టం కేసు పెట్టాలని ప్రత్యర్థి పార్టీ నేతలకు సవాల్ విసిరారు.
బిలాదిలా మైన్‍ను కేటాయించాలని 2018లోనే కోరాం: కేటీఆర్
తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 2018 జూన్‌లో బిలాదిలా మైన్‍ను కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామన్నారు. సెప్టెంబర్ 2018లో ఏర్పాటు చేసిన అదానీ అనుబంధ సంస్థకు బైలాదిలా గనిని అప్పగించారని ఆరోపించారు. బైలాదిలా నుంచి బయ్యారం వరకు 160కి.మీ మేర స్లర్రీ పైప్‌లైన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని, పైపులైన్ వేయడానికి అయ్యే ఖర్చులో 50 శాతం భరించేందుకు అంగీకరించిందని మంత్రి తెలిపారు. బైలదిలా నుంచి బయ్యారం, వీఎస్‌పీకి 600కి.మీ దురం ఉన్నందున ఖనిజం రవాణా చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని చెప్పిన కేంద్రం, గుజరాత్‌లోని ముంద్రాలో 1800కిలోమీటర్ల దూరంలో ఉన్న అదానీకి చెందిన ప్లాంట్‌కు ఖనిజ రవాణా ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు.