Forbes: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయులు ఎంతమంది అంటే?
ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను 2023 ఏడాదికి గాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కింది. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. 2022లో కూడా ఈ ముగ్గురు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ ఏడాది కూడా వారి స్థానాలను నిలుపుకోవడం విశేషం. అమెరికన్ గాయకుడు-గేయరచయిత టేలర్ స్విఫ్ట్ 5వ ఐదవ స్థానంలో నిలిచారు. 2022 టేలర్ 79స్థానంలో ఉన్నారు. ఈ సారి ఏకంగా 5వ స్థానానానికి ఎగబాకారు.
ఫోర్బ్స్ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కింది వీళ్లకే
ఫోర్బ్స్-2023 అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్, మరో ముగ్గురు భారతీయ మహిళలు కూడా ఉన్నారు. నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ రోష్నీ నాడార్ మల్హోత్రా 60వ ర్యాంకు సాధించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సోమ మండల్ ర్యాంక్ 70వ స్థానంలో ఉన్నారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా ర్యాంక్ 76వ స్థానంలో నిలిచారు. నిర్మలా సీతారామన్ ప్రస్తుతం భారత ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అలాగే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా ఆమె నాయకత్వం వహిస్తున్నారు. హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కుమార్తెనే రోష్నీ నాడార్ మల్హోత్రా. తండ్రి తర్వాత రోష్నీనే వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నారు.