LOADING...
Telangana: గోదావరి జలాలతో ఖమ్మం రైతులకు ఊరట.. 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు
గోదావరి జలాలతో ఖమ్మం రైతులకు ఊరట.. 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు

Telangana: గోదావరి జలాలతో ఖమ్మం రైతులకు ఊరట.. 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతుల్లో ఆందోళన పెరిగింది. ఈ ప్రాంతాలకు ప్రధాన సాగునీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో పంటల సాగుపై అనిశ్చితి నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో కృష్ణా జలాల కొరతను గోదావరి జలాలు భర్తీ చేయనున్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు ముందే గోదావరి నీరు కృష్ణా ఆయకట్టులోకి చేరేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో సాగర్ నుంచి నీరు అందకపోయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

సీఎం నిర్ణయంతో వేగవంతమైన చర్యలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 44 మండలాల్లో 15 మండలాల్లో వర్షపాతం లోటుగా నమోదవగా,మరో 20 మండలాల్లో సాధారణ స్థాయికి సమీపంలోనే వర్షాలు కురిశాయి. సాధారణంగా ఖమ్మం జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల ఆయకట్టుకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా కృష్ణా జలాలు అందుతుంటాయి. అయితే ఈసారి సాగర్‌లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను ఎన్నెస్పీ కాల్వల ద్వారా వైరా, లంకాసాగర్ జలాశయాలకు తరలించాలని నిర్ణయించింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించి,సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌లకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

వివరాలు 

రాజీవ్ లింక్ కెనాల్‌తో సాధ్యమైన పరిష్కారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన మూడు పంపుహౌస్‌లను 2024 ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే పంపింగ్ వ్యవస్థ ద్వారా గోదావరి నీటిని నాగార్జునసాగర్ కాల్వల్లోకి తరలిస్తూ రైతులకు సాగునీటి భరోసా కల్పిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో రాజీవ్ లింక్ కెనాల్ ప్రతిపాదన లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలం పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కేవలం రూ.60 కోట్ల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మిస్తే 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని వివరించగా, ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

గోదావరి జలాల ప్రయాణం ఇలా..

దీంతో పనులు వేగంగా పూర్తయ్యాయని, ఇప్పుడు మధిర, వైరా, తల్లాడ, వేంసూరు మండలాల రైతుల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని మంత్రి వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీకొత్తూరు సమీపంలోని తొలి పంపుహౌస్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని గోదావరి నుంచి గ్రావిటీ ద్వారా నీరు చేరుతోంది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు తొలి మోటార్‌ను ప్రారంభించి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి నీరు గ్రావిటీ ద్వారా 43 కిలోమీటర్లు ప్రయాణించి ములకలపల్లి మండలం పూసుగూడెంలోని రెండో పంపుహౌస్‌కు బుధవారం సాయంత్రం 7 గంటలకు చేరుకుంది. అనంతరం రాత్రి 9 గంటలకు రెండో దశ పంపింగ్ ప్రారంభించారు.

Advertisement

వివరాలు 

1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు

రెండో పంపుహౌస్ నుంచి నీరు 57 కిలోమీటర్లు ప్రయాణించి ములకలపల్లి మండలం కమలాపురంలోని మూడో పంపుహౌస్‌కు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు చేరుకుంది. అక్కడి నుంచి మోటార్ల సహాయంతో మరో 100 కిలోమీటర్ల దూరంలోని రాజీవ్ లింక్ కెనాల్‌కు గురువారం రాత్రి 11 గంటల సమయంలో చేరేలా ఏర్పాట్లు చేశారు. రాజీవ్ లింక్ కెనాల్ నుంచి నీరు ఎన్నెస్పీ ప్రధాన బ్రాంచి కాల్వ (21 ఎంబీసీ)లోకి ప్రవేశించి, అక్కడి రెగ్యులేటర్ ద్వారా శుక్రవారం ఉదయం వైరా జలాశయానికి చేరుతుంది. అనంతరం లంకాసాగర్ జలాశయానికి తరలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని భద్రాద్రి సీఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Advertisement