LOADING...
Amit Shah: జీమెయిల్‌కు గుడ్ బై.. జోహో మెయిల్‌కు మారిన అమిత్ షా
జీమెయిల్‌కు గుడ్ బై.. జోహో మెయిల్‌కు మారిన అమిత్ షా

Amit Shah: జీమెయిల్‌కు గుడ్ బై.. జోహో మెయిల్‌కు మారిన అమిత్ షా

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ సాంకేతికతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 'ఆత్మనిర్భర్ భారత్' లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అధికారిక ఈమెయిల్ సేవలను గూగుల్ జీమెయిల్ నుంచి స్వదేశీ సాఫ్ట్‌వేర్ కంపెనీ 'జోహో మెయిల్‌'కు మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్వయంగా ప్రకటించారు. అందరికీ నమస్కారం, నేను జోహో మెయిల్‌కు మారాను. దయచేసి నా ఈమెయిల్ అడ్రస్‌లో మార్పును గమనించగలరు. నా కొత్త చిరునామా: [amitshah.bjp@zohomail.in](mailto:amitshah.bjp@zohomail.in). భవిష్యత్తులో నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు ఈ చిరునామాను ఉపయోగించగలరని అమిత్ షా పోస్టు చేశారు.

Details

అమిత్ షా బాటలోనే అశ్వినీ వైష్ణవ్

కేంద్ర మంత్రులు ఇప్పటికే స్వదేశీ సాంకేతికత వైపే దృష్టి పెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా జోహో ప్లాట్‌ఫామ్‌కు మారారు. డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్ల కోసం ఇది అత్యంత సౌకర్యవంతమైన వేదిక అని ఆయన తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ దేశీయ ఉత్పత్తులు, సేవలను స్వీకరించాలన్నట్టు ఆయన కోరారు. ఇక కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా అధికారులందరికి జోహో ఆఫీస్ సూట్ వాడాలని ఆదేశాలు జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, గూగుల్ వర్క్‌స్పేస్ వంటి విదేశీ ప్లాట్‌ఫామ్‌లకు బదులుగా జోహో రైటర్, జోహో షీట్, జోహో షోలను ఉపయోగించాలన్న స్పష్టత ఇచ్చింది.

Details

దేశీయ సాంకేతికత విస్తరణకు తోడ్పాటు

కొత్త ప్లాట్‌ఫామ్ పై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఎన్ఐసీ (NIC) సహాయం అందిస్తోంది. చెన్నైకి చెందిన శ్రీధర్ వెంబు స్థాపించిన జోహో, ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే జోహో అభివృద్ధి చేసిన 'అరట్టై' మెసేజింగ్ యాప్ కూడా పాపులారిటీ సృష్టిస్తోంది. ఈ యాప్, డొమైన్‌లో నంబర్ వన్ అయిన వాట్సాప్‌కు సవాల్ విసురుతూ, దేశీయ సాంకేతికత విస్తరణకు తోడ్పడుతోంది.