గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక
తండ్రి వజ్రాల వ్యాపారి, రూ. కోట్లలో ఆస్తి, విసాలవంతమైన జీవితం, ఏది కావాలన్నా క్షణాల్లో తెచిపెట్టే తల్లిదండ్రులు.. వీటన్నింటి త్యజించి, ఎనిమిదేళ్లకే భక్తి మార్గంలో నడవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. అనుకున్న విధంగానే జైన సన్యాసాన్ని స్వీకరించింది. ఈ అసాధారణ ఘటన గుజరాత్‌లో జరిగింది. సన్యాసాన్ని స్వీకరించిన ఈ చిన్నారి పేరు దేవాన్షీ. ధనేష్-అమీ సంఘ్వీ ఈమె తల్లిదండ్రులు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా, దేవాన్షీ పెద్ద కుమార్తె. దేవాన్షీకి నాలుగెళ్ల చెల్లెలు ఉంది. ధనేష్ గుజరాత్‌లోనే పేరున్న వజ్రాల వ్యాపారి. గత 30ఏళ్లుగా ఆయన ఈ వ్యాపారమే చేస్తున్నారు. విదేశాల్లో కూడా ధనేష్ వ్యాపారాలు చేస్తుంటాడు. వీరి కుటుంబ ఆస్తి రూ.500కోట్లు ఉంటుందని అంచనా.
సూరత్‌లో భారీ వేడుక, ఒంటెలు, గుర్రాలపై బాలిక ఊరేగింపు
దేవాన్షీ జైన సన్యాసిగా మారుతున్న నేపథ్యంలో ఆమె తండ్రి ధనేష్ భారీ స్థాయిలో వేడుకను నిర్వహించారు. జైన సన్యాసి ఆచార్య విజయ్ కీర్తియాశ్సూరితో పాటు వందల మంది జైన సన్యాసులు మధ్య సూరత్‌లోని వెసు ప్రాంతంలో ఈ వేడుక జరిగింది. జనవరి 15న ప్రారంభమైన ఈ వేడుక జనవరి 18న ముగిసింది. జనవరి 17న సన్యాసం స్వీకరించడానికి ఒక రోజు ముందు, ఒంటెలు, ఏనుగులు, గుర్రాలతో నగరంలో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. దేవాన్షీకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువని, ఆమె ఇష్టం ప్రకారమే జైన సన్యాసిగా మారిందని కుటుంబ సభ్యులు చెప్పారు. సన్యాసాన్ని స్వీకరించడానికి ముందు ఇతర సన్యాసులతో కలిసి దాదాపు 700కిలోమీటర్లు నడిచినట్లు వారు వెల్లడించారు.