మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్
ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబేన్(100) కన్నుమూశారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆ తర్వాత కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి మరణవార్త తెలుసుకున్న ప్రధాని మోదీ హుటాహుటిన దిల్లీ నుంచి అహ్మదాబాద్‍కు చేరుకున్నారు. హీరాబేన్ మృతి పట్ల దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. మోదీకి సానుభూతిని ప్రకటించారు.
'నా తల్లిది సంపూర్ణ జీవితం'
తల్లి మృతి పట్ల మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ' వందేళ్ల జీవితాన్ని సంపూర్ణంగా గడిపి నా తల్లి దేవుడి పాదాల చెంతకు చేరింది. ఆమెలో ఎప్పుడూ త్రిమూర్తులు ఉన్నట్లు నేను భావిస్తా. ఒక సన్యాసిలా.. నిస్వార్థ కర్మయోగిగా.. విలువలకు కట్టుబడిన జీవితం ఆమెది' అని మోదీ ట్వీట్ చేశారు. హీరాబెన్ అంతిమయాత్రలో గుజరాత్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతిమయాత్రమలో హీరాబెన్ భౌతికకాయాన్ని మోదీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ కూడా మోశారు. మోదీ తల్లి అంత్యక్రియలను గాంధీనగర్‌లోని శ్మశానలో నిర్వహించారు.