Mohan Bhagwat: వీధి కుక్కల సమస్యకు మధ్యమార్గమే పరిష్కారం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య తీవ్ర చర్చకు దారి తీస్తోంది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో డాగ్ లవర్స్ పెద్ద సంఖ్యలో రోడ్లెక్కి నిరసనలు నిర్వహించారు. ఈ అంశంపై ఇప్పటికీ అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలు సమాజంలో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మనుషులు, జంతువులు, ప్రకృతి పరస్పరం సమన్వయంతో జీవించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమతుల్య సహజీవనాన్ని ఎలా కొనసాగించాలనే విషయంపై సమాజం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
ఈ అంశంపై రెండు విభిన్న అభిప్రాయాలు
గురువారం నాగపూర్‌లో ఇండియన్ సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కానైన్ ప్రాక్టీస్‌తో పాటు మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ యూనివర్సిటీ (MAFSU) సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సింపోజియంలో మోహన్ భగవత్ ప్రసంగించారు. 'ఒక ఆరోగ్యంలో కుక్కల పాత్ర-భాగస్వామ్యాన్ని నిర్మించడం, సవాళ్లను ఎదుర్కోవడం' అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇటీవల సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఢిల్లీలో గందరగోళ పరిస్థితులకు కారణమైందని అన్నారు. ఈ అంశంపై రెండు విభిన్న అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఒక వర్గం కుక్కలను పూర్తిగా తొలగించాలనే అభిప్రాయం వ్యక్తం చేయగా, మరో వర్గం వాటిని అసలు తాకకూడదని వాదించిందన్నారు. ఈ విషయంపై తనను అడిగినప్పుడు మధ్యమార్గం కూడా సాధ్యమేనని తాను చెప్పినట్లు వివరించారు.
వివరాలు
పశువైద్యుల పాత్రపై..
కుక్కల సంఖ్యను నియంత్రించేందుకు స్టెరిలైజేషన్ వంటి చర్యలు ఉపయోగకరమని,అలాగే ప్రజల భద్రతను కాపాడేందుకు ఇతర రక్షణ చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. తాను పశువైద్యుడిగా తన వృత్తిపరమైన అనుభవంతోనే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇక పశువైద్యుల పాత్రపై మాట్లాడుతూ, గతంలో పశువైద్యులకు పరిమిత అవకాశాలే ఉన్నాయని భావించేవారమని,కానీ ఆ ఆలోచన సరైనది కాదని అన్నారు. జంతు ఆరోగ్యం,సంరక్షణ అంశాల్లో మరింత విస్తృత దృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రత్యేకమైన పశువైద్య మండలి ఏర్పాటు కావాల్సిందేనని, అది తప్పనిసరి అని తనకు గట్టి నమ్మకం ఉందని చెప్పారు. జంతువులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో జంతువులపై అవగాహన ఉన్న పశువైద్యులు లేదా జంతు శాస్త్ర నిపుణుల సూచనలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వివరాలు
జంతువులకు సంబంధించిన అంశాల్లో పశువైద్యులకే పూర్తి అవగాహన
జంతువుల స్వభావం, అవసరాలపై సరైన జ్ఞానం ఉన్నవారు వారే కాబట్టి బాధ్యతలు కూడా వారికే అప్పగించాలని అన్నారు. ఈ సందర్భంలో క్రీడారంగాన్ని ఉదాహరణగా తీసుకుంటూ, క్రీడలకు సంబంధించిన నిర్ణయాలు క్రీడాకారులు లేదా ఆ రంగానికి చెందిన నిపుణులే తీసుకుంటారని గుర్తు చేశారు. అదే విధంగా జంతువులకు సంబంధించిన అంశాల్లో పశువైద్యులకే పూర్తి అవగాహన ఉంటుందని తెలిపారు. అందువల్ల వారి సూచనలు తీసుకుంటూ ఆ రంగాన్ని ముందుకు తీసుకెళ్తేనే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.