Andhrapradesh: లోక్ అదాలత్‌లకు విశేష స్పందన.. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షలకు పైగా కేసుల పరిష్కారం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని నిర్వహించిన లోక్ అదాలత్‌లకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఒక్క రోజులోనే మొత్తం 2,65,279 కేసులు పరిష్కారమవగా, బాధితులకు రూ.217 కోట్లకు పైగా పరిహారం చెల్లించేలా అవార్డులు జారీ అయ్యాయి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ రవినాథ్ తిల్హరి, హైకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్మన్ జస్టిస్ బట్టు దేవానంద్ పర్యవేక్షణలో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో మొత్తం 420 లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేసి విచారణలు చేపట్టారు.
వివరాలు
హైకోర్టులో ఐదు ప్రత్యేక బెంచ్‌లు..
ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో మొత్తం ఐదు లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. ఈ బెంచ్‌లకు జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ కుంచం మహేశ్వరరావు, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ అధ్యక్షత వహించారు. ఈ బెంచ్‌లలో మొత్తం 135 కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.6.06 కోట్ల పరిహారం చెల్లించేలా అవార్డులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, విశాఖపట్నంలోని రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్టీ) బెంచ్ కూడా 29 కేసులను పరిష్కరించి, రూ.50.46 కోట్ల పరిహారం చెల్లింపునకు సంబంధించిన అవార్డులను జారీ చేసింది.