LOADING...
Illegal Migrants: హైదరాబాద్‌కు పెరుగుతున్న అక్రమ వలసలు.. అధికారుల దర్యాప్తులో షాకింగ్ వివరాలు
హైదరాబాద్‌కు పెరుగుతున్న అక్రమ వలసలు.. అధికారుల దర్యాప్తులో షాకింగ్ వివరాలు

Illegal Migrants: హైదరాబాద్‌కు పెరుగుతున్న అక్రమ వలసలు.. అధికారుల దర్యాప్తులో షాకింగ్ వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్రమ వలసదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అధికారులు విస్తృతంగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో వెలుగులోకి వస్తున్న అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య వేలల్లో ఉన్నట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ఆఫ్రికా దేశాలకు చెందిన 1,400 మందికి పైగా వ్యక్తులు రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే రోహింగ్యాల సంఖ్య సుమారు 9,500 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన వారి అధికారిక సంఖ్య 40గా నమోదై ఉన్నప్పటికీ, అక్రమంగా నివసిస్తున్న వారి సంఖ్య 4 వేలకుపైగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

వివరాలు 

వాస్తవ సంఖ్య కంటే అక్రమ వలసదారులు ఎక్కువగా ఉండే అవకాశం

అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం సవాలుగా మారింది. ప్రస్తుతం నిఘా వర్గాల నుంచి అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ అంచనాలను రూపొందించారు. అయితే వాస్తవ సంఖ్య దీనికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

మానవతా దృక్పథంతో పాటు చట్టపరమైన చర్యలు

ఉపాధి, జీవనోపాధి కోసం దేశంలోకి వచ్చిన వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహింగ్యాలను మినహాయించి మిగతా అక్రమ వలసదారులను గుర్తించి, వారి స్వదేశాలకు పంపించే చర్యలు చేపడుతున్నారు. ఆఫ్రికా దేశాలకు చెందిన వారిలో కొందరు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యాపారాల్లో పాల్గొంటున్నట్లు ఇప్పటికే పలు కేసుల్లో బయటపడింది. ఈగల్ అధికారులు 2025లో మాదకద్రవ్యాల కేసుల్లో ఆఫ్రికా దేశాలకు చెందిన 24 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు అరెస్టైన వారితో కలిపి మొత్తం 42 మందిని వారి స్వదేశాలకు డిపోర్ట్ చేసినట్లు సమాచారం.

Advertisement

వివరాలు 

హైదరాబాద్ వైపు అక్రమ వలసదారుల మొగ్గు

బంగ్లాదేశ్, మయన్మార్ వంటి సరిహద్దు దేశాల నుంచి పలువురు భద్రతా బలగాల కళ్లుగప్పి భారతదేశంలోకి ప్రవేశిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా ఇటువంటి వలసదారులు సరిహద్దు రాష్ట్రాల్లోనే స్థిరపడుతుంటారు. అయితే ఇటీవల హైదరాబాద్‌ను కూడా ఆశ్రయంగా ఎంచుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో జీవన వ్యయం తక్కువగా ఉండటం, ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించడం వల్లే వారు ఈ నగరాన్ని ఎంచుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

వీసా గడువు ముగిసిన తర్వాత అజ్ఞాతంలోకి..

కొంతమంది విదేశీయులు చట్టబద్ధంగానే వీసాతో దేశంలోకి వచ్చినప్పటికీ, వీసా గడువు ముగిసిన తర్వాత ఆచూకీ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. దీంతో వారిని గుర్తించడం అధికారులకు కష్టంగా మారుతోంది. ఇలా అదృశ్యమయ్యే వారిలో చాలామంది దిల్లీ, ముంబయి తర్వాత హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఖచ్చితమైన సంఖ్య లెక్కగట్టడం కూడా కష్టమైన పనే

రాష్ట్రంలో మొత్తం ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారనే విషయాన్ని ఖచ్చితంగా లెక్కించడం అధికారులకు సవాలుగా మారింది. ఇమిగ్రేషన్ బ్యూరో అధికారికంగా దేశంలోకి ప్రవేశించిన వారిలో తిరిగి వెళ్లని వారి వివరాలను మాత్రమే ప్రధానంగా నమోదు చేస్తుంది. అనధికారికంగా నివసిస్తున్న వారి వివరాలను గుర్తించేందుకు ఇమిగ్రేషన్ బ్యూరోతో పాటు రాష్ట్ర పోలీసు శాఖలు, నిఘా సంస్థలు సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచార ప్రకారం రాష్ట్రంలో,ముఖ్యంగా హైదరాబాద్‌లో, సుమారు 21,563 మంది అక్రమ వలసదారులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిని గుర్తించి తదుపరి చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Advertisement