NITI Aayog: 'చదివేదొకటి, చేసేదొకటి... ఎందుకయ్యా ఈ డిగ్రీలు'.. నీతి ఆయోగ్ రిపోర్ట్‌లో సంచలనాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ఉన్నత విద్యా వ్యవస్థకు తక్షణ సంస్కరణలు అవసరమని నీతి ఆయోగ్ తాజా నివేదిక హెచ్చరించింది. లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగాలకు నేరుగా ఉపయోగపడని సాధారణ డిగ్రీ కోర్సుల వైపు మొగ్గుచూపుతున్నారని నివేదిక పేర్కొంది. దేశంలోని డిగ్రీ కళాశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐలు), పాలిటెక్నిక్‌లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని తెలిపింది. విద్యా విధానానికి, ఉద్యోగ అవకాశాలకు మధ్య గణనీయమైన అంతరం ఏర్పడుతోందని నివేదిక స్పష్టం చేసింది.
వివరాలు
పట్టభద్రుల్లో పెరుగుతున్న నిరుద్యోగం
ఆర్థిక సర్వే 2024-25ను ఉటంకించిన నీతి ఆయోగ్.. తమ విద్యార్హతలకు సరిపోయే ఉద్యోగాల్లో పనిచేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25 శాతమేనని పేర్కొంది.
మొత్తం పట్టభద్రుల్లో విద్యావంతుల నిరుద్యోగిత రేటు 13 శాతంగా ఉండగా.. మహిళా పట్టభద్రుల్లో ఇది ఏకంగా 20.4 శాతంగా ఉందని తెలిపింది.
జాతీయ సగటు నిరుద్యోగిత రేటు 3.2 శాతంతో పోలిస్తే ఈ గణాంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
విద్యకు తగ్గ ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడాన్ని ఈ పరిస్థితి సూచిస్తోందని నివేదిక పేర్కొంది.
వివరాలు
అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో భారీగా చేరికలు
దేశంలో ఏకంగా 3.4 కోట్ల మంది విద్యార్థులు అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చదువుతున్నారని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది.
వీరిలో ఎక్కువ మంది బీఏ, బీఎస్సీ, బీకాం వంటి సాధారణ డిగ్రీ కోర్సులను ఎంచుకుంటున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించే అవకాశాలను అందుబాటులో ఉంచుకోవాలనుకునే విద్యార్థుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
2024 నవంబర్ నుంచి 2025 జులై మధ్య కేవలం 55 వేల ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏకంగా 1.86 కోట్ల దరఖాస్తులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
వివరాలు
పరిశ్రమల భాగస్వామ్యం.. పీపీపీ విధానాల అవసరం
ఈ సమస్యను పరిష్కరించేందుకు విద్యా వ్యవస్థలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచాలని నీతి ఆయోగ్ సూచించింది.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP) విధానాలను విస్తృతంగా అమలు చేయాలని పేర్కొంది.
దీనివల్ల పాఠ్యాంశాలను ఆధునికీకరించడంతో పాటు ఉద్యోగాలకు అనుసంధానమైన శిక్షణను అందించే అవకాశం ఉంటుందని తెలిపింది.
పరిశ్రమల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది.
ఉన్నత విద్యను వాస్తవ ఉద్యోగ అవకాశాలకు అనుసంధానం చేయాలంటే ఈ మార్పులు కీలకమని పేర్కొంది.
వివరాలు
సాధారణ డిగ్రీల నుంచి ఉద్యోగ ఆధారిత కోర్సుల వైపు..
విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సులకే పరిమితం కాకుండా ప్రత్యేక నైపుణ్యాలను అందించే, ఉద్యోగాలకు నేరుగా ఉపయోగపడే కోర్సుల వైపు మళ్లాలని నీతి ఆయోగ్ సూచించింది.
ముఖ్యంగా బీఏ, బీఎస్సీ, బీకాం వంటి ఎక్కువ మంది చేరే కోర్సుల్లో ఈ మార్పు అవసరమని తెలిపింది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా బీఏ హాస్పిటాలిటీ, బీకాం అనలిటిక్స్ వంటి ప్రత్యేక కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.
అలాగే పని చేస్తూనే నేర్చుకునే విధానం, అప్రెంటిస్‌షిప్‌తో కూడిన డిగ్రీ కోర్సులను భారీగా విస్తరించాలని పేర్కొంది.
దీంతో చదువు పూర్తయ్యే నాటికే విద్యార్థులకు వాస్తవ ఉద్యోగ అనుభవం లభించే అవకాశం ఉంటుందని నివేదిక తెలిపింది.