LOADING...
CM Chandrababu: గూడూరులో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్.. 10 వేల మందికి ఉపాధి: సీఎం చంద్రబాబు
10 వేల మందికి ఉపాధి: సీఎం చంద్రబాబు

CM Chandrababu: గూడూరులో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్.. 10 వేల మందికి ఉపాధి: సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం పూర్తిగా మారిందని, ఒకప్పుడు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయినా.. ఇప్పుడు రాష్ట్రంపై పెరిగిన విశ్వాసంతో వారే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన పాల్గొని, కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి రోడ్‌మ్యాప్‌ను ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అమలు చేస్తున్న 'పీ4' కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. దేశానికి ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా సంఘాల మాదిరిగానే రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

వివరాలు 

10 వేల మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు

ప్రస్తుతం దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వస్తున్నాయని, పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే గూడూరులో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పార్క్ ఏర్పాటుతో దాదాపు 10 వేల మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటూనే, పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement