IndiGo: బెంగళూరు విమానంలో హైటెన్షన్ .. టిష్యూ పేపర్‌పై 'బాంబు' అని రాసిన నోట్
ఈ వార్తాకథనం ఏంటి
లక్నో నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కలకలం రేపింది. విమానం బెంగళూరులో ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులను అప్రమత్తం చేశారు. బుధవారం ఉదయం ఇండిగో విమానం 6E231 బెంగళూరులో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. విమానంలోని టాయిలెట్ వద్ద ఓ టిష్యూ పేపర్‌పై 'బాంబు' అని రాసి ఉన్న నోట్‌ను క్యాబిన్ సిబ్బంది గుర్తించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో విమానం ల్యాండ్ అయ్యేలోపే సంబంధిత అధికారులకు సమాచారం చేరింది.
వివరాలు
విమానం సేఫ్ ల్యాండింగ్... ప్రయాణికులను దించిన అధికారులు
ఉదయం 9.40 గంటలకు విమానం బెంగళూరు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని సాధారణ పార్కింగ్ ప్రాంతానికి కాకుండా ప్రత్యేక ప్రదేశానికి తరలించారు.
అనంతరం అందులోని ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు.
ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి.
విమానంలోని ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. క్యాబిన్, ప్రయాణికుల సీట్లు, ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్లు, టాయిలెట్లు సహా అన్ని చోట్ల సోదాలు నిర్వహించారు.
వివరాలు
తనిఖీల్లో ఉత్తిదేనని తేల్చిన బాంబ్ స్క్వాడ్
అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ కనిపించలేదు.
దీంతో విమానానికి వచ్చిన బాంబు బెదిరింపు కేవలం ఆకతాయిల చర్యగా అధికారులు నిర్ధారించారు.
విమానాన్ని తిరిగి కార్యకలాపాలకు అనుమతించారు. టిష్యూ పేపర్‌పై బాంబు అని రాసిన నోట్‌ను ఎవరు పెట్టారనే విషయంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.