LOADING...
Polavaram: పోలవరం ముంపుపై భద్రాచలంలో తొలి ఉమ్మడి సర్వే.. రక్షణ చర్యలపై చర్చ
పోలవరం ముంపుపై భద్రాచలంలో తొలి ఉమ్మడి సర్వే.. రక్షణ చర్యలపై చర్చ

Polavaram: పోలవరం ముంపుపై భద్రాచలంలో తొలి ఉమ్మడి సర్వే.. రక్షణ చర్యలపై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే బ్యాక్‌వాటర్ ప్రభావం భద్రాచలం పట్టణంపై ఎంత మేర ఉండొచ్చనే అంశంపై తొలి ఉమ్మడి క్షేత్రస్థాయి సర్వే గురువారం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నిపుణులతో ఇటీవల ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ఈ పరిశీలన చేపట్టింది. పీపీఏ ఛైర్మన్ ఎస్. సతీశ్, కార్యదర్శి సభ్యుడు ఎ. ప్రవీణ్, సభ్యులు స్రవంతి (పీపీఏ), దామోదర్ (ఏపీ), జానీ (తెలంగాణ), వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన సందీప్‌లతో కూడిన బృందం ముందుగా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్‌లో సమావేశమైంది. అనంతరం భద్రాచలం గోదావరి కరకట్టను సందర్శించి అక్కడి స్లూయిస్‌ల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించింది.

వివరాలు 

భద్రాచలం వద్ద గోదావరి వరద మట్టం 43 అడుగుల వరకు చేరే అవకాశం

ఈ సందర్భంగా ఎటపాక ప్రాంతంలోని స్లూయిస్‌లను 30 అడుగుల లోపే మూసివేయాల్సిన అవసరం ఉంటుందని తెలంగాణ అధికారులు వివరించారు. అలాగే భద్రాచలం కొత్తకాలనీ వద్ద ఉన్న స్లూయిస్‌ను 36 అడుగుల నీటిమట్టం వద్ద, విస్తా కాంప్లెక్స్ సమీపంలోని స్లూయిస్‌ను 39 అడుగుల వద్ద మూసివేయాల్సి ఉంటుందని బృందానికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం కొనసాగితే భద్రాచలం వద్ద గోదావరి వరద మట్టం 43 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అలాంటి పరిస్థితుల్లో స్లూయిస్‌లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణుల దృష్టికి తీసుకెళ్లారు.

వివరాలు 

త్వరలో మరోసారి భద్రాచలం ప్రాంతాన్ని సందర్శించనున్న ఉమ్మడి బృందం

అదేవిధంగా భద్రాచలం కరకట్టను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు. బ్యాక్‌వాటర్ కారణంగా పట్టణంలో ముంపు తలెత్తకుండా ఉండేందుకు అధిక సామర్థ్యం గల బాహుబలి మోటార్లు, అవసరమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిపుణులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ చర్యలు సమర్థవంతంగా అమలవ్వాలంటే సంబంధిత శాఖల అధికారుల మధ్య నిరంతర సమన్వయం తప్పనిసరిగా ఉండాలని కూడా సూచించినట్లు తెలిసింది. ఈ ఉమ్మడి బృందం త్వరలో మరోసారి భద్రాచలం ప్రాంతాన్ని సందర్శించి, ముంపు ముప్పును తగ్గించేందుకు అవసరమైన సాంకేతిక సూచనలు, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనుందని భద్రాచలం నీటిపారుదల శాఖ ఈఈ జానీ వెల్లడించారు.

Advertisement