Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయం.. మైదుకూరులో ఎన్నికల నిలిపివేత..!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసింది. నామినేషన్ కేంద్రంలో పత్రాలను చించివేసిన ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించకూడదని స్పష్టం చేశారు.
వివరాలు
19 నామినేషన్ పత్రాలు ధ్వంసం
రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం.. అక్టోబర్ 17న మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మైదుకూరు మున్సిపల్ నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించారు.
అక్కడ ఉన్న 19 నామినేషన్ పత్రాలను చించివేశారు. ఈ ఘటన కారణంగా మొత్తం 18 మంది అభ్యర్థులు ప్రభావితమయ్యారు.
దీనిపై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు.
నామినేషన్ పత్రాల ధ్వంసం వ్యవహారంపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.
వివరాలు
ఒక్క అభ్యర్థి మాత్రమే మళ్లీ నామినేషన్
పత్రాలు ధ్వంసమైన అభ్యర్థులు మరోసారి నామినేషన్లు దాఖలు చేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
అక్టోబర్ 18న మధ్యాహ్నం 3 గంటల్లోపు కొత్త నామినేషన్ పత్రాలను సమర్పించాలని సూచించారు.
ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు.
అయినప్పటికీ, ప్రభావితమైన 18 మంది అభ్యర్థుల్లో బీజేపీ తరఫున 21వ వార్డుకు పోటీ చేస్తున్న మచునూరి శ్రీదేవి మాత్రమే తిరిగి నామినేషన్ దాఖలు చేశారు.
మిగిలిన 17 మంది అభ్యర్థులు మాత్రం మళ్లీ నామినేషన్లు సమర్పించలేదు.
వివరాలు
తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్నికల ప్రక్రియ నిలిపివేత
మైదుకూరు ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ సమర్పించిన నివేదికలను రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించింది.
అనంతరం మైదుకూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికతో పాటు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన తదుపరి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిలుపుదల అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
దీంతో మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.