TTD Meeting : వేతనాల పెంపు, ఇళ్ల స్థలాల పంపిణీ.. టీటీడీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)కు సంబంధించిన పాలక మండలి సమావేశం మంగళవారం జరగ్గా.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోటు కార్మికులకు రూ.10వేలు వరకు జీతాలు పెంచాలని నిర్ణయించారు. అలాగే వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, శానిటేషన్ ఉద్యోగులు, పీస్ రేట్ బార్బర్ల వేతనాల పెంపుదలకు పాలకమండలి ఆమోదం తెలిపింది. పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాలకు ప్రతి ఏటా ఇచ్చే ప్యాకేజీకి అదనంగా మరో రూ.1కోటి ఇవ్వాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలని ఇచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. తొలుత ఈనెల 28న 3,518 మందికి, జనవరిలో మరో 1500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చేందుకు మరో 350 ఎకరాలను కొనుగోలు చేయనున్నారు.
తిరుపతిలోని అతిథి గృహాల నిర్మాణానికి టెండర్లు
తిరుపతిలోని పాత సత్రాలు తొలగించాలని నిర్ణయించారు. అలాగే కొత్త అతిథి గృహాల నిర్మాణానికి టెండర్లకు ఆహ్వానించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. జార్ఖండ్‌లో ఆ ప్రభుత్వం టీటీడీకి 100 ఎకరాలు స్థలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. చంద్రగిరిలో ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ.2కోట్లు కేటాయించారు. ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులను ఆహ్వానించి ప్రత్యేక సదస్సు నిర్వహించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.