Pawan Kalyan: అలిపిరి నడక మార్గంలో చిరుత కలకలం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలోని దొరసాని మండపం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే అప్రమత్తమయ్యారు. యాత్రికుల రక్షణకు ఎలాంటి లోటు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెట్ల మార్గంలో చిరుత కనిపించిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పవన్ కళ్యాణ్‌కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన, భక్తుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని చర్యలు కొనసాగించాలని సూచించారు.
వివరాలు
టీటీడీ అటవీ విభాగం అలెర్ట్..
చిరుత సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ, టీటీడీ అటవీ విభాగం, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నారని అధికారులు పవన్ కల్యాణ్‌కు తెలిపారు. అలాగే హనుమాన్ బృందాలను కూడా అప్రమత్తం చేసి నిఘాను మరింత పెంచినట్లు వివరించారు. ఈ పరిస్థితుల్లో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. నడక మార్గంలో ప్రయాణించే యాత్రికులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సూచనలు అందించాలని చెప్పారు. సున్నిత ప్రాంతాల్లో దట్టంగా పెరిగిన పొదలను తొలగించి స్పష్టమైన వీక్షణ మార్గాలు (వ్యూ లైన్స్) ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా ప్రయాణించేలా ముందుగానే అవగాహన కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.