Page Loader
MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం! 
చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం!

MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది. ప్రస్తుతం చర్లపల్లి నుంచి ఒకే ఎంఎంటీఎస్‌ రైలు నడుస్తుండగా, ఇకపై నాలుగైదు నెలల్లో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. టెర్మినల్‌ నుంచి నడిపే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అనుగుణంగా కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్‌ స్టేషన్లను అనుసంధానిస్తూ సబర్బన్‌ రైలు సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. సోమవారం రైల్‌ నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (జీఎం) అరుణ్‌కుమార్‌ జైన్‌ ఈ వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో 10 జతల రైళ్లను చర్లపల్లికి తరలించనున్నట్టు తెలిపారు.

Details

చర్లపల్లి నుంచి నడిపేందుకు సిద్ధం

ఈ రైళ్లకు అనుగుణంగా ఎంఎంటీఎస్‌ సర్వీసులను పెంచే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల కారణంగా, కాచిగూడ, హైదరాబాద్‌ స్టేషన్లపై రద్దీ తగ్గించేందుకు మరిన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే చార్మినార్, గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లను మార్చి నుంచి నడపనున్నట్లు తెలిపారు. మే నెలాఖరుకల్లా మరో 8 జతల రైళ్లను నడిపేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. చర్లపల్లి నుంచి నగరానికి ప్రయాణికులను చేర్చే ఎంఎంటీఎస్‌ సర్వీసుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని, ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ స్పష్టంచేశారు.