INS Sumitra: సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్థానీ నావికులను కాపాడిన ఇండియన్ నేవీ
భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక మంగళవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఫిషింగ్ ఓడ నుంచి 19మంది పాకిస్థానీ పౌరులను భారత నౌకాదళం రక్షించింది. భారత నౌకాదళ నౌక ఐఎన్‌ఎస్ సుమిత్ర.. సాయుధ సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఫిషింగ్ నౌక అల్ నమీని రక్షించడం ద్వారా ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు రక్షణ అధికారులు తెలిపారు. కొచ్చి తీరానికి 800 మైళ్ల దూరంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఇండియన్ నేవీ మెరైన్ కమాండోలు చురుకుగా పాల్గొన్నారని వెల్లడించారు. ఇది 'ఐఎన్‌ఎస్ సుమిత్ర' విజయంవంతంగా పూర్తి చేసిన రెండో ఆపరేషన్ కావడం గమనార్హం.
మొదటి ఆపరేషన్‌లో ఇరాన్ నౌకను కాపాడిన ఐఎన్‌ఎస్ సుమిత్ర
సోమాలియాలోని తూర్పు తీర ప్రాంతంలో ఇరాన్ జెండాతో కూడిన ఓడను ఆదివారం అర్థరాత్రి హైజాక్ చేయగా.. భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ రంగంలోకి దింగింది. ఇరాన్ నౌక తోపాటు అందులోని 17మంది సిబ్బందిని రక్షించింది. ఆదివారం అర్థరాత్రి హైజాకింగ్ సమాచారం అందుకున్న భారత నావికాదళం.. అరేబియా సముద్రం సమీపంలోని ఏడెన్ గల్ఫ్‌లో మోహరించిన ఐఎన్‌ఎస్ సుమిత్రను వెంటనే అలర్ట్ చేసింది. తక్షణమే ఇరాన్ ఫిషింగ్ ఓడ 'ఇమాన్' వైపు దూసుకెళ్లింది. అనంతరం ఇరాన్ నౌకను కాపాడి, అందులో ఉన్న 17మందిని రక్షించింది. ఈ సందర్భంగా భారతీయ నావికాదళ ప్రతినిధి మాట్లాడుతూ.. హిందూ మహాసముద్ర ప్రాంతంలో యాంటీ పైరెట్స్ ఆపరేషన్‌తో పాటు సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం భారత నావికాదళ యుద్ధనౌకలను మొహరించినట్లు పేర్కొన్నారు.