ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు
అతివాద, నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను లక్ష్యంగా చేసుకుని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం తెల్లవారుజామున కేరళ వ్యాప్తంగా సోదాలు చేపట్టింది. రాష్ట్రంలో దాదాపు 56చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది. పీఎఫ్ఐ నాయకులు వేరొక సంస్థ పేరుతో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఈ క్రమంలో అనుమానితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తెల్లవారుజామున 4గంటల నుంచి ఎర్నాకులం, తిరువనంతపురంతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తీవ్రవాదులతో సంబంధం పెట్టుకొని.. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 28న పీఎఫ్ఐను నిషేధిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నిషధం ఐదేళ్లపాటు ఉండనుంది.
2006లో ఏర్పాటు.. అనతికాలంలోనే దేశవ్యాప్తంగా..
2006లో కేరళలో పీఎఫ్ఐను ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ సంస్థకు దిల్లీలో ప్రధాన కార్యాలయం కూడా ఉంది. అణగారిన వర్గాల కోసమే తాము పాటు పడుతున్నట్లు పీఎఫ్ఐ నాయకులు చెప్పేవారు. అయితే ఈ సంస్థ పట్ల కేంద్రంతో పాటు భద్రతా సంస్థల వాదనలు భిన్నంగా ఉన్నాయి. పీఎఫ్ఐ అనేది ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ప్రభుత్వ వర్గాలు భావించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పీఎఫ్ఐ సంస్థను బ్యాన్ చేసింది. పీఎఫ్ఐని నిషేధించిన తర్వాత.. కేరళలో హింసాకాండ జరిగింది. ఫలితంగా భారీగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగింది. దీనిపై సీరియస్ అయిన కేరళ హైకోర్టు.. జరిగిన నష్టాన్ని నిందితుల నుంచే వసూలు చేయాలని ఆదేశించింది.