AP Municipal Elections: 5,485 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి.. నేటి నుంచి 3 రోజులపాటు స్వీకరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్'లోని 100 పురపాలక సంస్థల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నామినేషన్ల స్వీకరణ చేపడతారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. మేయర్, మున్సిపల్ ఛైర్పర్సన్ పదవులతో పాటు 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కోసం మొత్తం 5,485 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు.
వివరాలు
నామినేషన్ల ఏర్పాట్లపై సమీక్ష
నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్, కమిషనర్ సంపత్‌కుమార్ గురువారం పురపాలక కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది.
ఎన్నికలు జరగనున్న 28 జిల్లాలకు ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా గురువారం పరిశీలకులతో సమావేశమయ్యారు.
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పరిశీలకులకు ఎస్ఈసీ సూచించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు ఉల్లంఘించకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
వివరాలు
ఎన్నికల గుర్తుల కేటాయింపుపై నోటిఫికేషన్
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు గుర్తుల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టరైన రాజకీయ పార్టీలకు వర్తించే ఎన్నికల గుర్తుల వివరాలను ఈ నోటిఫికేషన్లో పేర్కొంది.
మేయర్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులే అమల్లో ఉంటాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
దీంతోపాటు బ్యాలెట్ పత్రంలో నోటా (NOTA) గుర్తును కూడా చేర్చింది.