LOADING...
ECNR Passport: 50 ఏళ్లు దాటితే ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు.. తెలుసుకోవాల్సిన కీలక నిబంధనలు
50 ఏళ్లు దాటితే ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు.. తెలుసుకోవాల్సిన కీలక నిబంధనలు

ECNR Passport: 50 ఏళ్లు దాటితే ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు.. తెలుసుకోవాల్సిన కీలక నిబంధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల విష్ణుకుమార్ చేనేత కార్మికుడు. ఆయన ఐదో తరగతి వరకు మాత్రమే చదివారు. దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న తన కుమారుడిని కలుసుకోవడంతో పాటు అక్కడ చిన్న ఉద్యోగం చేయాలన్నఉద్దేశంతో విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ లేకపోవడంతో సాధారణ నిబంధనల ప్రకారం ఆయనకు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) పాస్‌పోర్టు మాత్రమే జారీ అవుతుంది. అలాంటి పాస్‌పోర్టు ఉంటే విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే ప్రతిసారి ప్రభుత్వ ఇమిగ్రేషన్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో దళారుల చేతిలో మోసపోయే ప్రమాదం ఉంటుందనే ఆందోళనతో విష్ణుకుమార్ తనకు తెలిసిన వ్యక్తిని సంప్రదించారు.

వివరాలు 

వయస్సు నిరూపణకు..

అప్పుడు 50 ఏళ్లు దాటిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించిందని,విద్యార్హతతో సంబంధం లేకుండా ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ (ఈసీఎన్‌ఆర్‌) కేటగిరీకి అర్హత ఉంటుందని తెలుసుకున్నారు. వెంటనే పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేశారు. వయస్సు నిరూపణకు ఆధార్ కార్డు, పాన్ కార్డు సమర్పించడంతో విద్యార్హత ధ్రువపత్రాలు అవసరం కాలేదు. ఆన్‌లైన్ దరఖాస్తులో 'Are You Eligible for Non-ECR Category' అనే ప్రశ్నకు 'Yes' అని ఎంపిక చేశారు. కారణం ఆయన వయస్సు 50 సంవత్సరాలు దాటడం. ఈ విధంగా నారాయణతో పాటు మరెందరో ఈ కేంద్ర ప్రభుత్వ నిబంధన వల్ల ప్రయోజనం పొందుతున్నారు.

వివరాలు 

ఈసీఆర్‌ పాస్‌పోర్టు అంటే ఏమిటి?

ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్‌) పాస్‌పోర్టు అనేది భారత ప్రభుత్వం గుర్తించిన 19 దేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లే ముందు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన పాస్‌పోర్టు కేటగిరీ. సాధారణంగా పదో తరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారికి ఈసీఆర్‌ పాస్‌పోర్టు జారీ చేస్తారు. విదేశాల్లో ఉద్యోగానికి వెళ్లే ఈ వర్గానికి విద్య, సామాజిక అవగాహన, చట్టాలపై పరిజ్ఞానం పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున, వారిని మోసాల నుంచి రక్షించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా శారీరక శ్రమ చేసే భారతీయ కార్మికులు (బ్లూ కాలర్ వర్కర్లు) విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం, వారి హక్కులు, భద్రత, సంక్షేమాన్ని కాపాడటం ఈసీఆర్‌ విధానం ప్రధాన ఉద్దేశం.

Advertisement

వివరాలు 

ఇమిగ్రేషన్ చెక్ ఎందుకు తీసుకొచ్చారు?

కొన్ని దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయ కార్మికులు మోసపోకుండా, అక్రమ నియామకాలకు గురికాకుండా రక్షించేందుకు భారత ప్రభుత్వం ఈ ఇమిగ్రేషన్ చెక్ నిబంధనను అమలు చేసింది. ఇమిగ్రేషన్ యాక్ట్-1983 ప్రకారం ఉద్యోగాల కోసం వెళ్లే సందర్భంలో ప్రత్యేక అనుమతి అవసరమైన 19 దేశాలను భారత ప్రభుత్వం ఈసీఆర్‌ దేశాలుగా ప్రకటించింది.

Advertisement

వివరాలు 

ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు అంటే ఏమిటి?

ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ (ఈసీఎన్‌ఆర్‌) పాస్‌పోర్టు కలిగిన వారికి విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లేందుకు భారత ప్రభుత్వ ప్రత్యేక ఇమిగ్రేషన్ అనుమతి అవసరం ఉండదు. క్రింది అర్హతల్లో ఏదైనా ఒకటి ఉన్న వారికి ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు జారీ చేస్తారు. పదో తరగతి ఉత్తీర్ణులు విదేశాల్లో కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపుదారులు 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగినవారు ఇలాంటి వారు విదేశాల్లో ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం, లోకజ్ఞానం, అవసరమైతే తమను తాము రక్షించుకునే అవగాహన కలిగి ఉంటారని ప్రభుత్వం భావిస్తుంది.

వివరాలు 

ఈసీఆర్‌ పరిధిలో ఉన్న 19 దేశాలు

ఈసీఆర్‌ నిబంధనలు వర్తించే దేశాల్లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)కి చెందిన ఆరు దేశాలు ఉన్నాయి. అవి: బహ్రెయిన్, సౌదీ అరేబియా,కువైట్, ఖతార్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), అఫ్గానిస్థాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేషియా, సూడాన్, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్, ఇండోనేషియా, థాయిలాండ్, ఇరాన్.

వివరాలు 

ఈసీఆర్‌ పాస్‌పోర్టు ఉన్న వారికి లభించే ప్రయోజనాలు

ఈసీఆర్‌ పాస్‌పోర్టు కలిగిన కార్మికులు ఈ 19 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే ముందు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ (పీవోఈ) కార్యాలయం నుంచి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ పొందాలి. ఈ ప్రక్రియలో కార్మికుడి పాస్‌పోర్టు వివరాలు, ఉద్యోగం ఇచ్చే సంస్థ, రిక్రూటింగ్ ఏజెన్సీ, వేతన ఒప్పందం తదితర సమాచారం ఇ-మైగ్రేట్ వ్యవస్థలో నమోదు చేస్తారు. అలాగే ఈసీఆర్‌ పాస్‌పోర్టు కలిగిన ప్రతి కార్మికుడికి ప్రవాసి భారతీయ బీమా యోజన (పీబీబీవై) కింద రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీ తప్పనిసరిగా జారీ చేస్తారు. ఇందుకు నిర్ణీత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ బీమాను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉంది.

Advertisement