Odisha: సిమెంట్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశా రాష్ట్రం, సుందర్‌ఘర్ జిల్లా రాజ్‌గంగ్‌పూర్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో బొగ్గు తొట్టి కుప్పకూలడంతో అనేక మంది కార్మికులు బొగ్గు కింద చిక్కుకుపోయారు.
స్థానికులు, సిబ్బంది ఇచ్చిన సమాచారంతో సహాయక బృందాలు తక్షణమే సంఘటనాస్థలానికి చేరుకుని చర్యలు ప్రారంభించాయి.
బొగ్గు కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు వెల్లడించాయి.
బొగ్గు తొట్టి కింద ఇంకా పలువురు చిక్కుకుపోయి ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగే సమయంలో 12 మందికి పైగా కార్మికులు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నట్టు తెలిసింది.
వివరాలు
ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం
మహిళా కార్మికులు కూడా ఈ ఘటనలో ఉన్నారని సమాచారం అందింది.
సహాయక చర్యల్లో భాగంగా జేసీబీ యంత్రాలు, ఇతర అవసరమైన సాధనాలతో రెస్క్యూ టీమ్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.
పోలీసులు కూడా సహాయక చర్యలలో పాల్గొంటూ రక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి సంఘటన స్థలాన్ని సందర్శించింది.
ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఫ్యాక్టరీ మేనేజర్, షిఫ్ట్ ఇన్‌చార్జ్, సేఫ్టీ అధికారి వంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.