Hyderabad: పాతబస్తీ మెట్రో భూసేకరణ.. 40 నిర్వాసితులకు పరిహార చెక్కులు అందజేత
ఈ వార్తాకథనం ఏంటి
పాతబస్తీ మెట్రో రైలు భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, మెట్రో ప్రాజెక్టు కోసం రూ.741 కోట్ల వ్యయంతో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో లైను నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు.
నాలుగేళ్లలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇందులో జర్మన్ సాంకేతికతను ఉపయోగిస్తామని వెల్లడించారు.
భూ నిర్వాసితులకు గజానికి రూ.81 వేల పరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు 40 మంది భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేశామని పేర్కొన్నారు.
Details
గజానికి రూ.81వేలు
మెట్రో లైను నిర్మాణంలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మొదటి దశలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినా ఆస్తుల సేకరణ, అలైన్‌మెంట్ వివాదాల కారణంగా ప్రాజెక్టు పదేళ్ల పాటు నిలిచిపోయింది.
ఈ కారణంగా ప్రాజెక్టును రెండో దశలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రైట్ ఆఫ్ వే కోసం ముందుగా రహదారులను విస్తరించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
సర్వే ప్రకారం, ఈ ప్రాజెక్టు కోసం 1100 ఆస్తులను సేకరించాల్సి వస్తుందని తేలింది.
భూసేకరణ కోసం విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ, గజానికి రూ.81 వేల పరిహారాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయించారు.