LOADING...
India-Pakistan Peace Talks: భారత్-పాక్ శాంతి చర్చలకు పిలుపు.. మోదీ,షరీఫ్‌కు 117 మంది లేఖ
భారత్-పాక్ శాంతి చర్చలకు పిలుపు.. మోదీ,షరీఫ్‌కు 117 మంది లేఖ

India-Pakistan Peace Talks: భారత్-పాక్ శాంతి చర్చలకు పిలుపు.. మోదీ,షరీఫ్‌కు 117 మంది లేఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరు దేశాల దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉగ్రవాదం సింధు జలాల అంశాలపై కఠిన వైఖరి అవలంబించిన భారత్.."నెత్తురు, నీరు కలిసి ప్రవహించలేవు"అనే సందేశంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికి, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించాలని కోరుతూ భారత్, పాకిస్థాన్‌కు చెందిన 117మంది ప్రముఖులు ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ,షెహబాజ్ షరీఫ్‌లకు బహిరంగ లేఖ రాశారు. భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభించి,దౌత్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

బహిరంగ లేఖను విడుదల చేసిన సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్

ఈ బహిరంగ లేఖను సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ విడుదల చేసింది. దీనిపై భారత్‌కు చెందిన 61 మంది, పాకిస్థాన్‌కు చెందిన 56 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలకు అనుమతిస్తే, సింధు జలాల విడుదల విషయంలో భారత్ సానుకూలంగా స్పందిస్తుందంటూ ఇటీవల పాకిస్థాన్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే ఈ ప్రచారాన్ని భారత్ స్పష్టంగా ఖండించింది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా కోట్లాది మంది యువత అవకాశాలు, అభివృద్ధి,భవిష్యత్ దెబ్బతింటోందని లేఖలో పేర్కొన్నారు. శత్రుత్వానికి ముగింపు పలికి,శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఇరు ప్రభుత్వాలు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేశారు.

వివరాలు 

ప్రముఖులు చేసిన ప్రధాన సూచనలు

భారత్-పాకిస్థాన్ మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలను వెంటనే పునరుద్ధరించాలి. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో హైకమిషనర్లను తిరిగి నియమించాలి. సాధారణ వీసా సేవలను మళ్లీ ప్రారంభించాలి. వాణిజ్య విమానాల రాకపోకల కోసం ఇరు దేశాల గగనతలాన్ని తిరిగి తెరవాలి. అట్టారి-వాఘా సరిహద్దు మార్గాన్ని వాణిజ్యం, ప్రయాణాల కోసం పునఃప్రారంభించాలి. శ్రీనగర్-ముజఫరాబాద్ బస్సు సేవలను తిరిగి ప్రారంభించాలి. తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఈ విజ్ఞప్తి చేయడం లేదని,ఇరు దేశాల్లోని దాదాపు 200 కోట్ల మంది ప్రజల సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖ రాసినట్లు ప్రముఖులు పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

ఈ లేఖపై సంతకాలు చేసిన వారు వీరే..

భారత్ తరఫున సంతకాలు చేసిన ప్రముఖుల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, కశ్మీర్ మత, రాజకీయ నాయకుడు మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్, ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా, ఏజేయూపీ నాయకుడు, టీఎంసీ మాజీ మంత్రి హుమాయున్ కబీర్ ఉన్నారు. పాకిస్థాన్ తరఫున మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహ్మూద్ కసూరీ, మాజీ దౌత్యవేత్త అష్రఫ్ జహంగీర్ ఖాజీ, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు ఇస్పన్యార్ భండారా, అణు భౌతిక శాస్త్రవేత్త, రచయిత పర్వేజ్ హుడ్‌భాయ్ తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు.

Advertisement