Ayodhya: రెండోరోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. 50వేల మంది రాత్రంతా గుడి బయటే
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన 2 రోజుల తర్వాత కూడా భక్తులు పొటెత్తారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 5లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీరాముడిని దర్శించుకోలేని దాదాపు 50,000 మంది మంగళవారం రాత్రంతా ఆలయం వెలుపల గుడారాలు వేసికొని నిరీక్షించడం గమనార్హం. బుధవారం ఉదయం ఆలయ తలుపులు తెరిచిన వెంటనే భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీని నియంత్రిచడం కోసం భద్రతా సిబ్బందిని సైతం ప్రభుత్వం పెంచింది. దీంతో రెండో రోజు తోపులాటలు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. భద్రతా ఏర్పాట్లను బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం) సంజయ్ ప్రసాద్, డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్‌తో సహా పలువురు సీనియర్ అధికారులు పర్యవేక్షించారు.
రెండోరోజు దర్శనానికి మరో 5లక్షల మంది
ప్రజలు క్యూలో నిలబడి సక్రమంగా ఆలయం లోపలికి వెళ్లేందుకు వీలుగా బుధవారం బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు దర్శనం సజావుగా జరిగేందుకు క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం క్యూ వ్యవస్థను పటిష్టం చేసినట్లు డీజీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఒక్కరోజే స్వామివారిని దాదాపు 5 లక్షల మంది దర్శించుకొని పూజలు చేశారు. బుధవారం కూడా శ్రీరాముడిని 5లక్షల మంది వరకు దర్శించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అంచనాలకు తగ్గట్టు రద్దీని నియంత్రించేందుకు కనీసం 8,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. మంగళవారం సాయంత్రం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని పరిశీలించేందుకు అయోధ్య చేరుకున్నారు. భక్తుల రద్దీ, భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమావేశమై సమీక్షించారు.