Loading...
Kharge: నిశ్శబ్దంగా ఉండండి.. ఐదు నిమిషాల్లో ముగిస్తా.. లేదంటే గంటసేపు మాట్లాడతా: ఖర్గే
నిశ్శబ్దంగా ఉండండి.. ఐదు నిమిషాల్లో ముగిస్తా.. లేదంటే గంటసేపు మాట్లాడతా: ఖర్గే

Kharge: నిశ్శబ్దంగా ఉండండి.. ఐదు నిమిషాల్లో ముగిస్తా.. లేదంటే గంటసేపు మాట్లాడతా: ఖర్గే

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన 'ఇండియా' కూటమి నిరసన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సభలో కార్యకర్తలు నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించడంతో ఆయన సరదాగా స్పందించారు. ''మీరు నిశ్శబ్దంగా ఉంటే ఐదు నిమిషాల్లో ప్రసంగం ముగిస్తాను. అలా కాకుండా అల్లరి చేస్తే గంటసేపు మాట్లాడతాను'' అని హెచ్చరించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. అంతకుముందు సుమారు 30 సెకన్లపాటు వేదికపై మౌనంగా నిలబడిన ఖర్గే.. చివరికి తన ప్రసంగాన్ని తొమ్మిది నిమిషాల్లో ముగించారు. ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్), ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా 'ఇండియా' కూటమి 'చలో ఢిల్లీ' పేరుతో ఈ నిరసన సభ నిర్వహించింది.

వివరాలు 

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను భూమిలోంచి అయినా లాక్కొస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ఖర్గే కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు.

మోదీ అధికారం నుంచి తప్పుకుంటేనే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఓట్ల దొంగతనం కారణంగానే అధికారంలోకి వచ్చాయని ఆరోపించారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాపాడుతున్నారని ఖర్గే విమర్శించారు.

ఆయన రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే భూమిలో నుంచి తవ్వి అయినా బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు.

గతంలో ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్య 'మోదీ కా బాప్ భీ జాయేగా' అనే నినాదాన్ని సభలో కొందరు కార్యకర్తలు మళ్లీ వినిపించారు.

వివరాలు 

నిరసన సభ అట్టర్ ఫ్లాప్: బీజేపీ  

ఖర్గే తర్వాత ప్రసంగించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. 2024 లోక్‌సభ ఎన్నికలు అక్రమంగా జరిగాయని ఆరోపించారు.

సీఈసీని పదవి నుంచి తొలగించి జైలుకు పంపుతామని వ్యాఖ్యానించారు.

ఈ సభలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

అయితే, 'ఇండియా' కూటమి నిర్వహించిన ఈ నిరసన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేపీ విమర్శించింది.

రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలోనే సభకు వచ్చిన ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆరోపించింది.

ADVERTISEMENT