Punjab: లవ్లీ యూనివర్సిటీలో అత్యాచారం వదంతులు.. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బయటి వ్యక్తి ఒకరు క్యాంపస్‌లో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో నిర్ధారణ లేని వార్తలు వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. శనివారం అర్ధరాత్రి దాదాపు 2 గంటల సమయంలో యువతుల హాస్టల్ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ ఆందోళనల్లో సుమారు 2,000మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్యాంపస్ భద్రత, యూనివర్సిటీ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు యూనివర్సిటీ గేటు, కిటికీ అద్దాలు, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు.
వివరాలు
అత్యాచారం, ఆత్మహత్యపై ఫిర్యాదు లేదు
పూల కుండీలు, ఇటుకలతో దాడులు చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో నిప్పు పెట్టినట్లు కూడా సమాచారం.
అనంతరం విద్యార్థులు సమీపంలోని జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిని దిగ్బంధించారు.
దీంతో ఆదివారం ఉదయం వరకు ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ ఘటనపై కపుర్తలా ఎస్ఎస్‌పీ గౌరవ్ తూరా స్పందించారు. అత్యాచారం లేదా ఆత్మహత్యకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన స్పష్టం చేశారు.
కొంతమంది విద్యార్థులు ఒక అమ్మాయి అత్యాచారానికి గురైందని, మరికొందరు ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశారని ఎస్ఎస్‌పీ తెలిపారు.
ప్రాథమిక విచారణలో ఈ ఆరోపణలను రుజువు చేసే ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు.
కేవలం వదంతుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వివరాలు
క్యాంపస్‌కు చేరుకున్న పోలీసులు
విద్యార్థుల ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎల్‌పీయూ క్యాంపస్‌కు చేరుకున్నారు. విద్యార్థులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అనంతరం జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరించారు.
ఇదిలా ఉండగా.. విద్యార్థుల ఆందోళనలకు కారణమైన సోషల్ మీడియా పోస్టుల మూలాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
నిర్ధారణ లేని వార్తలు ఎలా వ్యాపించాయన్న అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది.