LOADING...
Conductor posts: టీజీఎస్‌ఆర్టీసీలో 1,500 కండక్టర్‌ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు
టీజీఎస్‌ఆర్టీసీలో 1,500 కండక్టర్‌ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు

Conductor posts: టీజీఎస్‌ఆర్టీసీలో 1,500 కండక్టర్‌ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 09, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్‌ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 1,500 కండక్టర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు వేగవంతం చేసింది. ఈ నియామకాలను సంస్థ స్వయంగా నిర్వహించనుండగా, అభ్యర్థుల ఎంపికను పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా చేపట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.

వివరాలు

శాశ్వత నియామకాలకు ప్రభుత్వం అనుమతి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీజీఎస్‌ఆర్టీసీ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు రెగ్యులర్‌ కండక్టర్‌ పోస్టులకు నియామకాలు చేపట్టలేదు. ఇదే సమయంలో ప్రతి సంవత్సరం ఉద్యోగులు పదవీ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు పలు రీజియన్ల పరిధిలోని డిపోల్లో తాత్కాలికంగా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో సిబ్బందిని నియమించారు. ఇప్పుడు శాశ్వత నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 1,500 పోస్టులను భర్తీ చేసేందుకు సంస్థ సన్నాహాలు ప్రారంభించింది.

వివరాలు

మార్కుల విధానం - గ్రేడింగ్‌ విధానంపై స్పష్టత కోసం కసరత్తు..

గతంలో కండక్టర్‌ ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల శాతాన్నే ప్రధాన ప్రమాణంగా పరిగణించేవారు. అలాగే ఆయా రీజియన్లలో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్‌ నిబంధనలను అనుసరించి నియామకాలు చేపట్టేవారు. అనంతరం పదో తరగతిలో గ్రేడింగ్‌ విధానం అమల్లోకి రావడంతో మార్కుల స్థానంలో గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా ఫలితాలు ప్రకటించబడ్డాయి. తాజాగా మళ్లీ మార్కుల విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల్లో కొందరి వద్ద మార్కుల శాతం ఉండగా, మరికొందరి వద్ద గ్రేడ్‌ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ రెండు విధానాలను ఒకే ప్రమాణంలో ఎలా పరిగణించాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు పరిశీలన చేపట్టారు.

Advertisement