LOADING...
Ayodhya Donation Scam: రామ మందిర విరాళాల దుర్వినియోగం.. వడ్డీ వ్యాపారం, షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు
రామ మందిర విరాళాల దుర్వినియోగం.. వడ్డీ వ్యాపారం, షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు

Ayodhya Donation Scam: రామ మందిర విరాళాల దుర్వినియోగం.. వడ్డీ వ్యాపారం, షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల సొమ్మును అక్రమంగా దుర్వినియోగం చేసిన నిందితులు ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారాలు నిర్వహించడంతో పాటు షేర్‌ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో వెల్లడైంది. అంతేకాదు, అక్రమంగా సంపాదించిన నగదును దాచిపెట్టేందుకు స్నేహితులు, బంధువుల బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన అనుకల్ప్‌ మిశ్ర, లవ్‌కుశ్‌ మిశ్ర, కరుణేశ్‌ పాండేలను పోలీసులు వరుసగా రెండు రోజుల పాటు వారి నివాసాలకు తీసుకెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులను కూడా విచారించారు. తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు కట్టలు, బంగారు ఆభరణాలు, ఒక కారును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

వివరాలు 

30 బ్యాంకు ఖాతాల జప్తు

దర్యాప్తులో భాగంగా నిందితుల బంధువులకు చెందిన మొత్తం 30 బ్యాంకు ఖాతాలను అధికారులు జప్తు చేశారు. ఆ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ అయినట్లు గుర్తించారు. భక్తుల విరాళాల సొమ్మును వివిధ మార్గాల్లో తరలించి అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు సిట్‌ అనుమానిస్తోంది. విచారణలో అనుకల్ప్‌ మిశ్రతో పాటు సహ నిందితుడు అవినాశ్‌ కూడా కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. రామాలయంలో అపహరించిన విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం నిర్వహించడంతో పాటు షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు వారు అంగీకరించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

అయోధ్యలో ఒక ఎకరం భూమి కొనుగోలు చేసిన అనుకల్ప్‌ మిశ్ర

దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. అనుకల్ప్‌ మిశ్ర అయోధ్యలో ఒక ఎకరం భూమిని రూ.6.7లక్షలకు కొనుగోలు చేసినట్లు సంబంధిత పత్రాలను సిట్‌ స్వాధీనం చేసుకుంది. ఈ కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలపై కూడా అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు,శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్, ట్రస్టీ అనిల్‌ మిశ్ర, ప్రత్యేక ఆహ్వానితుడు గోపాల్‌ రావుకు గతంలో జారీ చేసిన డిజిటల్‌ ఐడీలను ఆలయ పాలక మండలి నిలిపివేసింది. ఈ డిజిటల్‌ ఐడీల ద్వారా తమ వద్దకు వచ్చిన భక్తులకు, ఇతరులకు వీఐపీ దర్శన పాస్‌ల కోసం సిఫార్సులు చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ సదుపాయాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Advertisement