LOADING...
Pawan Kalyan: పిఠాపురం పవిత్ర భూమి.. వివాదాలకు కాదు: పవన్‌ కళ్యాణ్ 

Pawan Kalyan: పిఠాపురం పవిత్ర భూమి.. వివాదాలకు కాదు: పవన్‌ కళ్యాణ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిఠాపురంలో జరిగే చిన్న విషయాలను కూడా అనవసరంగా వైరల్‌ చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురంలో కాకి ఈక పడినా ఏదో పెద్ద విషయం జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వాస్తవం లేని అంశాలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడం మానుకోవాలని హితవు పలికారు. పిఠాపురంలో నిర్వహించిన 'పిఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌తో కలిసి ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించారు.

వివరాలు 

పండుగను అన్ని మతాల వారు కలిసి జరుపుకునే స్థాయికి తీసుకెళ్లాలి: పవన్ 

పిఠాపురం సంక్రాంతి ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు రావాలని పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ పండుగను అన్ని మతాల వారు కలిసి జరుపుకునే స్థాయికి తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రజల ప్రేమను తీసుకెళ్లాలన్న లక్ష్యంతో అక్కడి సోదరీమణులను సంక్రాంతి పండుగకు ఆహ్వానించి, గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని వారికి పరిచయం చేయాలని సూచించారు. సంక్రాంతి అంటే కేవలం కోడిపందేలు, జూదాలు మాత్రమే కాదని, అవి చేసే వారిని తాను అడ్డుకోనని స్పష్టం చేస్తూనే, పండుగ ఆ ఆనందాలకు మాత్రమే పరిమితం కాకూడదన్నారు.

వివరాలు 

అధికారంలో ఉన్నా లేకపోయినా చివరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం సేవ చేస్తా: పవన్ 

పిఠాపురం దేశానికి ఎంతో ప్రాధాన్యం కలిగిన శక్తిపీఠమని, శ్రీపాద శ్రీవల్లభుడు అవతరించిన పవిత్ర భూమి ఇదని గుర్తు చేశారు. ఇలాంటి ప్రాంతం నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయడం భగవంతుడి సంకల్పమేనని చెప్పారు. పిఠాపురం అభివృద్ధి కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, తనను మరింత బలోపేతం చేస్తే ఇంకా ఎక్కువగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్నా లేకపోయినా చివరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం సేవ చేస్తానని స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి : పవన్ 

ఇతర ప్రాంతాల్లో జరిగే తీవ్రమైన ఘటనలు పెద్దగా వార్తలు కాకపోయినా,పిఠాపురంలో చిన్నపాటి సంఘటనలు కూడా పెద్ద వార్తలుగా మారుతున్నాయని పవన్‌ వ్యాఖ్యానించారు. పిఠాపురానికి వచ్చి గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తే తాను కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో దూషణలు, కేసుల రాజకీయాలు జరిగాయని, అలాంటి పరిస్థితులను మళ్లీ తీసుకురావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తన మాటలు మృదువుగా ఉన్నా, చర్యలు మాత్రం దృఢంగా ఉంటాయని చెప్పారు.

Advertisement

వివరాలు 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం అత్యంత అవసరం : పవన్ 

తనపై లేదా తన పార్టీపై విమర్శలను తాను సహిస్తానని, కానీ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వారిని మాత్రం క్షమించనని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కూటమిలోని నేతలు పొత్తులను బలహీనం చేసే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. ప్రజలను ఎలా రక్షించాలి అనే అంశంపై తనకు, చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని పవన్‌కల్యాణ్ అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 'పిఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు'లలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం 

Advertisement