వన్ నేషన్ వన్ ప్రోడక్ట్: 72స్టేషన్లలో స్టాల్స్ ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే
స్థానిక కళాకారుల కళలను ప్రోత్సహించేందుకు, తమ కళలకు మార్కెట్ సృష్టించడానికి 2022-23బడ్జెట్ లో వన్ నేషన్ - వన్ ప్రోడక్ట్ అనే పద్దతిని తీసుకొచ్చారు. దీనిలో భాగంగా స్థానిక కళాకారులు తమ నైపుణ్యంతో తయారు చేసిన కళాకృతులను అమ్ముకోవడానికి రైల్వే స్టేషన్లలో వన్ నేషన్ - వన్ ప్రోడక్ట్ అనే పేరుతో స్టాల్స్ ని ఏర్పాటు చేసారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు 72రైల్వే స్టేషన్లలో 77 స్టాల్స్ ఏర్పాటు చేసారు. ఇక తెలంగాణ రాష్ట్ర పరిధిలో చూసుకుంటే 26రైల్వే స్టేషన్లలో 29స్టాల్స్ ఏర్పాటయ్యాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కాచిగూడ, గద్వాల్ తదితర రైల్వే స్టేషన్లలో ఒకే దేశం- ఒకే ఉత్పత్తి స్టాల్స్ ఏర్పాటు చేసారు.
చిరుధాన్యాల కోసం ఏడు ప్రత్యేక స్టాల్స్
తెలంగాణలో నారాయణ పేట్, గద్వాల, పోచంపల్లి చీరల కోసం ప్రత్యేకంగా ఆరు స్టాల్స్ ను ఏర్పాటు చేసారు. అలాగే చిరుధాన్యాల కోసం ఏడు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. భద్రాచలం వెదురు కళాకృతులు, దేవుడి విగ్రహాలు, నిర్మల్ కొయ్యబొమ్మలు, హస్తకళతో తయారైన వస్తువులు.. మొదలైనవన్నీ ఈ స్టాల్స్ లో దొరుకుతాయి. ఒకే దేశం - ఒకే ఉత్పత్తి గురించి మాట్లాడిన దక్షిణ మధ్య రైల్వే అరుణ్ కుమార్, ఈ స్కీమ్ కారణంగా స్థానికంగా కళాకృతులు తయారు చేసే కళాకారులకు తన నైపుణ్యాన్ని బయటపెట్టుకునేందుకు అవకాశం దొరుకుతుందని అన్నాడు. అలాగే ప్రయాణీకులకు రైల్వే స్టేషన్లలో మంచి అనుభవం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు.