Telangana: ఉన్నత విద్యలో తెలంగాణకు నాలుగో స్థానం.. జీఈఆర్‌లో మెరుగైన ప్రదర్శన
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో ప్రతి 100 మందిలో 46.60 మంది డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని 'అఖిల భారత ఉన్నత విద్య సర్వే (AISHE) 2023-24' వెల్లడించింది. ఈ నమోదును స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో-జీఈఆర్)గా పరిగణిస్తారు. తెలంగాణ దేశవ్యాప్తంగా నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో బిహార్ తొలి స్థానంలో, పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉన్నాయి.
వివరాలు
ఆఖరి స్థానంలో తెలంగాణ..
దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మంది జనాభాకు సగటున 32 కళాశాలలు ఉండగా, తెలంగాణలో మాత్రం ఈ సంఖ్య 56కు చేరింది. రాష్ట్రంలో మొత్తం 2,160 కళాశాలలు ఉండటంతో అత్యధిక కళాశాలలు కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. పీహెచ్‌డీ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్నట్లు సర్వే వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం పీహెచ్‌డీలో నమోదు చేసుకున్న వారి సంఖ్య 9,347కు చేరుకుంది. అయితే దక్షిణ భారత రాష్ట్రాలతో పోల్చితే ఈ విభాగంలో తెలంగాణ ఇప్పటికీ చివరి స్థానంలోనే కొనసాగుతోంది.
వివరాలు
దేశవ్యాప్తంగా జీఈఆర్ 30 శాతానికి చేరిక..
అఖిల భారత ఉన్నత విద్య సర్వే 2023-24 ప్రకారం దేశంలో ఉన్నత విద్య స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 30 శాతానికి చేరుకుంది. 2014-15లో ఇది 23.7 శాతంగా ఉండగా, 2023-24 నాటికి 30 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. బాలికల జీఈఆర్ కూడా ఇదే కాలంలో గణనీయంగా పెరిగింది. 2014-15లో 22.9 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2023-24 నాటికి 31.2 శాతానికి చేరుకుంది. అదే విధంగా ఎస్సీ విద్యార్థుల జీఈఆర్ 18.9 శాతం నుంచి 27.8 శాతానికి, ఎస్టీ విద్యార్థుల జీఈఆర్ 13.5 శాతం నుంచి 22.8 శాతానికి పెరిగినట్లు సర్వే స్పష్టం చేసింది. ఈ సూచికలో మహిళల ప్రాతినిధ్యం పురుషులతో పోలిస్తే 1.08 శాతం అధికంగా నమోదైంది.