Telangana: ఫ్యూచర్ సిటీలో భారీ స్టేడియం.. 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో భారీ అంతర్జాతీయ క్రీడా వేదికకు రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం రాష్ట్రంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు ప్రధాన వేదికగా ఉంది. ఇందులో సుమారు 35-40 వేల మంది ప్రేక్షకులు కూర్చునే అవకాశం ఉంది. ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్‌లతో సందడిగా కనిపించిన ఎల్బీ స్టేడియం ప్రస్తుతం ఎక్కువగా బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలకే ఉపయోగపడుతోంది. దీంతో లక్ష మందికి పైగా ప్రేక్షకులు వీక్షించేలా క్రికెట్, ఫుట్‌బాల్ వంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించేందుకు, భారీ సంగీత కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం సరైన మైదానం లేదు.
వివరాలు
100 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్రీడా ప్రాంగణం
ఈ లోటును భర్తీ చేసేందుకు ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక సదుపాయాలతో భారీ స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్రీడా ప్రాంగణాన్ని నిర్మించనున్నారు.
దేశ,విదేశాల్లోని ప్రముఖ స్టేడియాలకు దీటుగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.
తెలంగాణలో కొత్త స్టేడియం నిర్మాణానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఇప్పటికే ఆసక్తి చూపింది.
ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా స్టేడియం నిర్మాణానికి ఆమోదం తెలపడంతో పనులు వేగం పుంజుకున్నాయి.
త్వరలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)తో హెచ్‌సీఏ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా..
సెప్టెంబరులో ఎంఓయూ ప్రక్రియను పూర్తి చేసి, డిసెంబరులో కొత్త స్టేడియం నిర్మాణానికి భూమిపూజ చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కొత్త స్టేడియాన్ని కేవలం క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితం చేయకుండా బహుళ క్రీడలకు ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నారు.
క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడల అంతర్జాతీయ పోటీలను నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేయనున్నారు.
అదే సమయంలో వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యే భారీ కాన్సర్ట్‌లను నిర్వహించేందుకు కూడా వీలుగా మౌలిక వసతులు కల్పించనున్నారు.
వివరాలు
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా..
స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు భవిష్యత్‌లో దాని నిర్వహణ వ్యయాన్ని కూడా బీసీసీఐ భరించనుంది.
రాష్ట్రప్రభుత్వం మాత్రం అవసరమైన భూమిని కేటాయించనుంది.ఈ ప్రాజెక్టుకు మరో ప్రధాన అనుకూలత దాని ప్రాంతమే.
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్),ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్(ఆర్‌ఆర్‌ఆర్),ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు విస్తరణ ప్రతిపాదన,శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటం వల్ల ప్రేక్షకుల రాకపోకలకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.
ఫ్యూచర్ సిటీలో భాగంగా అభివృద్ధి చేస్తున్న స్పోర్ట్స్ సిటీ,టూరిజం,నెట్‌జీరో సిటీ వంటి విస్తృత ప్రణాళికల్లో ఈ భారీ క్రీడా ప్రాంగణం కీలక భాగంగా నిలవనుంది.
భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రీడాపోటీలు,భారీ వినోద కార్యక్రమాలకు హైదరాబాద్‌ను మరింత ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ స్టేడియం కీలకంగా మారే అవకాశం ఉంది.