Andhrapradesh: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. సచివాలయంలో ఏపీ ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలు, పెండింగ్ అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన పెండింగ్ అంశాలను మంత్రులకు వివరించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు.
వివరాలు
మొత్తం 23 డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పణ..
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు.. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మొత్తం 23 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తమకు సమర్పించినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక్కో అంశాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ నెల 21న సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి ఉద్యోగుల సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఆ సమావేశానికి ముందే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో మరోసారి చర్చించి పరిష్కార మార్గాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
వివరాలు
సమస్యల పరిష్కారంపై చర్చలు..
ప్రస్తుతం ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై చర్చలు కొనసాగిస్తున్నందున ఉద్యోగులు తమ ఆందోళన కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం మరింత బలపడేలా నిరంతర చర్చలు కొనసాగిస్తామని, ఉద్యోగుల సంక్షేమంతో పాటు సమర్థవంతమైన పాలన అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐకాస అమరావతి గౌరవ ఛైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావుతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.