Praksam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి
ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఇప్పటికే రెండు బోట్లను తొలగించిన అధికారులు, తాజాగా మూడో బోటును అధికారులు సురక్షితంగా బయటికి తీశారు. రెండు ఇనుప గడ్డర్లను ఉపయోగించి, చైన్ పుల్లర్లతో బోటును బయటకు తీసుకువచ్చి బ్యారేజీ ఎగువ ప్రాంతానికి తరలించారు. 40 టన్నుల బరువు ఉన్న ఈ పడవ, 69వ గేటు వద్ద ఢీకొని అడ్డుగా మారింది. ఇంజినీర్లు ప్రస్తుతం ఈ పడవను పున్నమి ఘాట్ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
15 రోజులు కష్టపడ్డ అధికారులు
బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు, అధికారులు ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కుపోయిన మూడు పెద్ద బోట్లను బయటకు తీశారు. బోట్లను తీయడానికి అధికారులు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈనెల 1 భారీ ప్రవాహానికి 5 పడవలు బ్యారేజీనీ ఢీకొట్టాయి. వాటికి ఒకటి దిగువకు కొట్టుకుపోగా, మిగతావి గేట్ల వద్ద చిక్కుకుపోయాయి.