దిల్లీ: దీపావళికి బాణాసంచా కాల్చడంపై ప్రభుత్వం నిషేధం
దిల్లీలో దీపావళికి బాణాసంచా కాల్చడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలను ఎవరూ చేపట్టకూడదని ఆయన హెచ్చరించారు. బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాల విషయంలో ఎవరికీ లైసెన్స్ ఇవ్వకూడదని పోలీసులను దిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. దిల్లీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కారణంగా రాజధానిలో కాలుష్యం నిరంతరం తగ్గుతోందని గోపాల్ రాయ్ అన్నారు. టపాకాయలు కాల్చడం వల్ల కాలుష్య మరింత ఎక్కువ పెరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను అనుసరించి దిల్లీలో బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించినట్లు ఆయన వివరించారు.