Loading...
Telangana: ఆధార్‌ ఆథెంటికేషన్‌తో రవాణా సేవలకు బ్రేక్‌.. వాహనదారులకు కొత్త చిక్కులు
ఆధార్‌ ఆథెంటికేషన్‌తో రవాణా సేవలకు బ్రేక్‌.. వాహనదారులకు కొత్త చిక్కులు

Telangana: ఆధార్‌ ఆథెంటికేషన్‌తో రవాణా సేవలకు బ్రేక్‌.. వాహనదారులకు కొత్త చిక్కులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

రవాణాశాఖ ఆన్‌లైన్‌ సేవల్లో ఆధార్‌ ఆథెంటికేషన్‌ తప్పనిసరి కావడంతో వాహనదారులు కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాంటాక్ట్‌లెస్‌ విధానంలో 22 రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, లైసెన్స్‌ కార్డులో చిరునామా మార్పు, ఫొటో మార్పు, మొబైల్‌ నంబరు సవరణ వంటి సేవలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ సేవలను పొందేందుకు ఆధార్‌ ఆథెంటికేషన్‌ కీలకంగా మారింది. దరఖాస్తుదారుడి ఆధార్‌ కార్డులోని పేరు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రికార్డుల్లోని పేరు ఒకే విధంగా ఉన్నప్పుడే దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఉదాహరణకు ఆధార్‌లో 'రాజేష్‌ కే' అని, డ్రైవింగ్‌ లైసెన్స్‌లో 'కే.రాజేష్‌' అని నమోదై ఉంటే దరఖాస్తు నిలిచిపోతోంది.

వివరాలు

అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడంలోనూ ఇక్కట్లు

పేరులో ఒక్క అక్షరం తేడా ఉన్నా ఇదే సమస్య ఎదురవుతోంది. దీంతో ఆన్‌లైన్‌లో సేవలు పొందాలనుకునే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

విదేశాలకు వెళ్లే వారు అక్కడ వాహనాలు నడిపేందుకు అవసరమైన అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను భారత్‌లోనే పొందాల్సి ఉంటుంది.

అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఆధార్‌ ఆథెంటికేషన్‌లో ఎదురవుతున్న సమస్యల కారణంగా ఈ లైసెన్స్‌ జారీ ప్రక్రియలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో దరఖాస్తుదారులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు.

ఈ సమస్యపై రవాణాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై చర్చించారు. తెలంగాణ రవాణాశాఖ కొంతకాలం క్రితమే కేంద్ర రవాణాశాఖ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న 'వాహన్‌', 'సారథి' పోర్టళ్లలో చేరింది.

వివరాలు

ఆర్టీవో కార్యాలయంలో పేర్లను సరిచేసుకోవాలి

అయితే, పాత రికార్డుల్లో పేర్లను నమోదు చేసిన విధానానికి, ప్రస్తుతం ఆధార్‌ ఆధారంగా గుర్తింపును ధ్రువీకరించే విధానానికి మధ్య వ్యత్యాసం ఉండటమే ఈ సమస్యలకు ప్రధాన కారణంగా మారింది.

కొత్తగా లెర్నర్స్‌ లైసెన్స్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్‌ వివరాల ఆధారంగానే దరఖాస్తును నింపుతుండటంతో వారికి సాధారణంగా ఈ సమస్యలు ఎదురుకావడం లేదని రవాణాశాఖ కమిషనర్‌ ఇలంబర్తి తెలిపారు.

ఆధార్‌ ఆథెంటికేషన్‌ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానమని, కాంటాక్ట్‌లెస్‌ సేవల్లో భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనను తప్పనిసరి చేసినట్లు ఆయన వివరించారు.

ఆధార్‌ కార్డులోని పేరు, రవాణాశాఖ రికార్డుల్లోని పేరు వేర్వేరుగా ఉన్నవారు ఆ వ్యత్యాసాన్ని ముందుగానే సరిచేసుకోవాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు

రవాణా కార్యాలయాన్ని సంప్రదించాలి

పేర్లలో మార్పులు, తేడాలను సరిచేసుకునేందుకు సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో)ను సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌తో పాటు ఇతర కాంటాక్ట్‌లెస్‌ సేవలను పొందడంలో ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

అందువల్ల ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రికార్డుల్లో పేర్లు వేర్వేరుగా ఉన్న వాహనదారులు ఆన్‌లైన్‌ సేవలకు దరఖాస్తు చేసే ముందు సంబంధిత ఆర్టీవో కార్యాలయంలో వివరాలను సరిచేసుకోవడం అవసరం.

ADVERTISEMENT