LOADING...
Two New Paddy Varieties: ఖరీఫ్‌లో వరి రైతులకు శుభవార్త.. రెండు కొత్త వరి వంగడాల ప్రయోగాత్మక సాగు ప్రారంభం
ఖరీఫ్‌లో వరి రైతులకు శుభవార్త.. రెండు కొత్త వరి వంగడాల ప్రయోగాత్మక సాగు ప్రారంభం

Two New Paddy Varieties: ఖరీఫ్‌లో వరి రైతులకు శుభవార్త.. రెండు కొత్త వరి వంగడాల ప్రయోగాత్మక సాగు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు చేస్తున్న రైతులకు బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శుభవార్త అందించారు. అధిక దిగుబడి, నాణ్యమైన బియ్యం ఉత్పత్తి లక్ష్యంగా అభివృద్ధి చేసిన రెండు కొత్త వరి వంగడాలను ప్రయోగాత్మక సాగు కోసం విడుదల చేశారు. ఎంపిక చేసిన ఏడు జిల్లాల రైతులకు ఏరువాక కేంద్రాలు, జిల్లా వ్యవసాయాధికారుల (డీఏఓ) కార్యాలయాల ద్వారా ఈ విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త కృష్ణవేణి మాట్లాడుతూ, స్వల్ప, మధ్యకాలిక వ్యవధి కలిగిన ఈ రెండు కొత్త వరి రకాలను ప్రతికూల పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు నాణ్యమైన బియ్యం అందించేలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

వివరాలు 

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు

ఈ వంగడాలను మూడేళ్లపాటు ప్రయోగాత్మకంగా సాగు చేసిన అనంతరం,మార్కెట్‌లో విడుదల చేసేందుకు అనుమతుల కోసం ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు. బీపీటీ-3372 వరి వంగడం కాల పరిమితి: 145 నుంచి 150 రోజులు దిగుబడి: హెక్టారుకు 6.50 నుంచి 7.50 టన్నులు గింజ నాణ్యత: పొడవాటి సన్నబియ్యం ప్రత్యేకతలు: విదేశీ ఎగుమతులకు అనువైన బియ్యం రకం. దోమపోటు, అగ్గితెగులు వంటి సమస్యలను తట్టుకునే సామర్థ్యం ఉంది. పంట చేనులో సులభంగా పడిపోదు. నీటి వసతి ఉన్న ఆయకట్టు ప్రాంతాల్లో సాగుకు అనువైన వంగడం. విత్తనాలు పంపిణీ చేస్తున్న జిల్లాలు: బాపట్ల, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి.

వివరాలు 

బీపీటీ-3284 వరి వంగడం

కాల పరిమితి: 130 నుంచి 135 రోజులు దిగుబడి: హెక్టారుకు 6 నుంచి 6.50 టన్నులు గింజ నాణ్యత: మధ్యస్థ సన్నబియ్యం ప్రత్యేకతలు: దోమపోటు,అగ్గితెగులు ప్రభావాన్ని తట్టుకునే లక్షణం ఉంది. పంట త్వరగా చేనుపై పడిపోదు. విత్తిన 75 నుంచి 80 రోజుల్లో చిరుపొట్ట దశకు చేరుకుంటుంది. 80 రోజుల్లోపు ఎరువుల నిర్వహణ పూర్తిచేయాలి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగు చేసే రైతులకు ఈ రకం అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాల్వల ద్వారా సాగునీరు ఆలస్యంగా అందే ఆయకట్టు ప్రాంతాల్లో ఈ వంగడం సాగు చేయాలని సిఫారసు చేస్తున్నారు. రబీ సీజన్‌లో కూడా ఈ రకం సాగుకు అనువైనదిగా పేర్కొంటున్నారు. విత్తనాలు పంపిణీ చేస్తున్న జిల్లాలు: బాపట్ల,పల్నాడు,తిరుపతి,నంద్యాల,కర్నూలు,నెల్లూరు,ప్రకాశం.

Advertisement