JKNF: 'జేకేఎన్‌ఎఫ్'ను ఐదేళ్ల పాటు నిషేధించిన కేంద్రం
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నయీమ్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని జమ్ము కశ్మీర్ నేషనల్ ఫ్రంట్ (JKNF)ను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చేలా హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ నేషనల్ ఫ్రంట్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతోందని, ఇది దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భద్రతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోదని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. జేకేఎన్ఎఫ్ సభ్యులు తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం, ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఉగ్రవాద శక్తులను నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాం: అమిత్ షా
భారత ప్రజల భద్రత కోసం ఉగ్రవాద శక్తులను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వెల్లడించారు. జేకేఎన్ఎఫ్ నాయకులు, సభ్యులు కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించేలా హింసాత్మక నిరసనకారులను ప్రేరేపించడంలో నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలపై నిరంతర రాళ్ల దాడులు చేస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. కశ్మీర్ ప్రజలు ఎన్నికలలో పాల్గొనద్దంటూ JKNF పిలుపునిచ్చిందని, తద్వారా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు ఆ సంస్థ భంగం కలిగించిందని కేంద్రం పేర్కొంది.